
ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గువహతిలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ కు అనుకోని అతిథి వచ్చింది. అయితే ఈ అతిథి మిగతా ప్రేక్షకుల మాదిరి కాదు.. వీఐపీలకు మించి.. మ్యాచ్ చూడటానికి వచ్చినవారెవరైనా బౌండరీ లైన్ పక్కనున్న పెన్షింగ్ బార్డర్ దాటి లోపలికి (గ్రౌండ్ సిబ్బంతి తప్ప) రావడానికి వీళ్లేదు. కానీ ఈ అతిథి మాత్రం మ్యాచ్ ను ‘దగ్గర్నుంచి చూద్దామని’ ఏకంగా పిచ్ వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించింది. ఆ అతిథి ఎవరో కాదు.. పాము.
అవును.. రెండో మ్యాచ్ జరుగుతున్న బర్సపర స్టేడియంలోకి ఈ సర్ఫం దర్జాగా ప్రవేశించింది. గ్రౌండ్ సిబ్బంది కళ్లుగప్పి స్టేడియంలో పదుల సంఖ్యలో ఉన్న కెమెరాలకు చిక్కకుండా.. మూడో కంటికి తెలియకుండా పిచ్ దగ్గరకు చేరింది. దీంతో కొంతసేపు మ్యాచ్ లో హడావిడి నెలకొంది.
భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు ఓవర్లు ముగిసి 8వ ఓవర్ ప్రారంభానికి ముందు పాము కెఎల్ రాహుల్ క్రీజులో ఉండగా పామును గమనించారు ఆటగాళ్లు. అసలది ఎక్కడ్నుంచి వచ్చిందనేది ఇప్పటికీ సస్పెన్సే..
నాగరాజు గారు ‘మరీ అంత దగ్గర్నుంచి మ్యాచ్ చూడటం’ మంచిది కాదని భావించిన ఆటగాళ్లు.. గ్రౌండ్ సిబ్బందికి కబురు చేశారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న సిబ్బంది.. ఆ సర్పాన్ని ఓ బుట్టలో వేసుకుని తీసుకెళ్లిపోయారు. అయితే మ్యాచ్ లోకి కుక్కల వంటి జంతువులు రావడం కొత్తేమీ కాదుగానీ పాము రావడం మాత్రం చాలా అరుదు.
వాస్తవానికి ఇండియా-హైదరాబాద్ మధ్య ఇటీవల ఉప్పల్ లో ముగిసిన మూడో టీ20లోనే పాముల బెడద ఉందని హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకాలం తర్వాత ఉప్పల్ లో మ్యాచ్ జరుగుతుండటం.. స్టేడియంలో వసతులు లేక నిర్వహణ సరిగా లేక అక్కడ పాములు ప్రత్యక్షమవడం పక్కా అనే కామెంట్లు వినిపించాయి. కానీ హైదరాబాద్ లో రాని పాములు.. గువహతిలో తేలాయి. ఏదేమైనా రెండో టీ20లో పాము వచ్చి హల్చల్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. ఇదిలాఉండగా ఈ మ్యాచ్ లో భారత్.. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్ లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (28 బంతుల్లో 57, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రోహిత్ శర్మ (37 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్స్) ఇచ్చిన ఆరంభాన్ని సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 49 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్) నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు.