పంత్‌ని ఫాలో అయిన కుశాల్ మెండీస్... పుల్ షాట్ ఆడబోయి బ్యాటుతో వికెట్ కీపర్‌ను కొట్టి...

By Chinthakindhi RamuFirst Published May 16, 2022, 6:16 PM IST
Highlights

బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్... 199 పరుగులు చేసి అవుట్ అయిన ఏంజెలో మాథ్యూస్...  పుల్ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ లిటన్ దాస్‌ను బ్యాటుతో కొట్టిన కుశాల్ మెండీస్... 

ఐపీఎల్‌ నడుస్తున్నప్పుడు దాదాపు వేరే దేశాలేవీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడవు. ఐపీఎల్‌ కోసం స్టార్ ప్లేయర్లు దూరంగా ఉంటే, సిరీస్‌లో ఆడడానికి ఇబ్బంది అవుతుందని అలా నిర్ణయం తీసుకుంటాయి క్రికెట్ బోర్డులు. అయితే ఓ వైపు ఐపీఎల్ 2022 సీజన్ ప్రీ క్లైమాక్స్ చేరుకోగా రెండు ఆసియా దేశాలు, ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనడం విశేషం...

బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సంఘటన, వికెట్ కీపర్ ప్రాణాల మీదికి తెచ్చింది. మొదటి ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్ నయీం హసన్ బౌలింగ్‌లో ఫుల్ షాట్ ఆడబోయాడు కుశాల్ మెండీస్. షాట్ మిస్ కాగా ఆ సమయంలో బాల్ అందుకోవడానికి ముందుకి వచ్చిన బంగ్లా వికెట్ కీపర్ లిటన్ దాస్, బ్యాటు బలంగా తాకింది...

లిటన్ దాస్ ఆ సమయంలో హెల్మెట్ ధరించి ఉండడం వల్ల, బ్యాటు బలంగా తగిలినా పెద్ద గాయమేమీ కాలేదు. ఫిజియో పర్యవేక్షణ తర్వాత ఆటను కొనసాగించాయి ఇరు జట్లు... సరిగ్గా ఇలాంటి సంఘటనే ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగింది. కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వికెట్ల మీద పడబోతున్న బంతిని బ్యాటుతో ఆపేందుకు ప్రయత్నించాడు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ రిషబ్ పంత్. ఆ సమయంలో కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, బంతిని పట్టుకునేందుకు ముందుకు రావడంతో పంత్ బ్యాటు అతనికి బలంగా తగిలింది... 

pic.twitter.com/PuGHsQIyGi

— cric fun (@cric12222)

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, 153 ఓవర్లలో 397 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒషాడో ఫెర్నాండో 36, కెప్టెన్ కరుణరత్నే 9 పరుగులు చేసి అవుట్ కాగా... కుశాల్ మెండీస్ 131 బంతుల్లో 3 ఫోర్లతో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

దినేశ్ ఛండీమల్ 66 పరుగులు చేయగా ఏంజెలో మాథ్యూస్ 397 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్సర్‌తో 199 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 1 పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న ఈ ఫీట్ సాధించిన మూడో శ్రీలంక క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, 1997లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 199 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు...

2012లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లంక మరో క్రికెటర్ కుమార సంగర్కర 199 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచి, డబుల్ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. ఈ ఇద్దరి తర్వాత ఒకే ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న మూడో లంక ప్లేయర్ మాథ్యూస్...

ఇంతకుముందు 2009లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద అవుటైన ఏంజెలో మాథ్యూస్, 199 పరుగుల వద్ద కూడా అవుటై... 1 పరుగు తేడాతో సెంచరీ, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న ఏకైక టెస్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు..

బంగ్లా బౌలర్ నయీం 6 వికెట్లు తీయగా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కి 3 వికెట్లు దక్కాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది బంగ్లాదేశ్. మహ్మదుల్ హసన్ జాయ్ 31, తమీమ్ ఇక్బాల్ 35 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్లేయర్లు అమ్ముడుపోలేదు. లంక నుంచి వానిందు హసరంగ, దుస్మంత ఛమీరా, భనుక రాజపక్ష, మహీశ తీక్షణ వంటి కొందరు ప్లేయర్లు, ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొంటుండగా, బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒక్కడే ఉన్నాడు...
 

click me!