
పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మేనల్లుడు మహ్మద్ హురైరా చరిత్ర సృష్టించాడు. 19 ఏండ్ల హురైరా.. దేశవాళీ క్రికెట్ లో అత్యంత పిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించాడు. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్ హురైరానే కావడం గమనార్హం. పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో భాగంగా ఖైద్ ఏ అజమ్ ట్రోఫీలో నార్తర్న్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. బలూచిస్థాన్ పై ట్రిపుల్ సెంచరీ సాధించి రికార్డులు సృష్టించాడు.
నార్తర్న్ తరఫున ఆడుతున్న సియాల్కోట్ హీరో హురైరా.. 314 బంతులు ఎదుర్కుని 300 పరుగులు సాధించాడు. మొత్తంగా అతడు.. 341 బంతుల్లో 311 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి మారథాన్ ఇన్నింగ్సులో 40 బౌండరీలు, 4 సిక్సర్లున్నాయి.
ఇదిలాఉండగా.. 19 ఏండ్ల 239 రోజుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన హురైరా ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థాన్ క్రికెటర్ అయ్యాడు. అంతకుముందు ఈ రికార్డు పాక్ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్ పేరిట ఉండేది. మియాందాద్.. 1975లో.. 17 ఏండ్ల 310 రోజుల వయసు ఉండగా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి సెంచరీ బాదాడు. మొత్తంగా పాక్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా.. ఈ ఘనత సాధించిన 22వ ఆటగాడిగా హురైరా నిలిచాడు.
ఇక 1975లో కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో మియాందాద్.. నేషనల్ బ్యాంక్ మీద సాధించాడు. మొత్తంగా 311 బంతులు ఎదుర్కొన్న మియాందాద్.. ట్రిపుల్ సెంచరీ బాదాడు.
ఇక సియాల్కోట్ కు చెందిన హురైరా.. 2002లో జన్మించిన హురైరా.. ఈ ఏడాది అక్టోబర్ లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు పాక్ అండర్-19 జట్టులో కూడా సభ్యుడు. ఖైద్ ఏ అజమ్ ట్రోఫీలో నార్తర్న్ తరఫున ఆడుతున్న హురైరా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే అతడు త్వరలోనే జాతీయ జట్టులోకి కూడా రావడం గ్యారెంటీ అంటున్నారు పాకిస్థాన్ అభిమానులు..