అక్టోబర్ 1 నుంచి సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా మధ్య ఇరానీ ట్రోఫీ 2023... ప్రాక్టీస్ మొదలెట్టేసిన సౌరాష్ట్ర ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా..
ఐసీసీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చే శిఖర్ ధావన్‌కి 2023 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదు. 2021 నుంచి టీ20ల్లో శిఖర్ ధావన్‌ని పట్టించుకోని టీమిండియా సెలక్టర్లు, 2022లో వన్డేల్లో కెప్టెన్సీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే 2023 నుంచి శిఖర్ ధావన్... మూడు ఫార్మాట్లకు దూరమయ్యాడు..
ఆడితే అంతర్జాతీయ క్రికెట్, లేదంటే ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న శిఖర్ ధావన్.. దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫామ్ నిరూపించుకుని టీమ్‌లోకి రావాలనే ఆప్షన్‌ని అస్సలు ఎంచుకోలేదు. తాను రంజీలో ఎంత బాగా ఆడినా టెస్టులకు తిరిగి ఎంపిక చేయరు? ఇక ఆడడం ఎందుకు.. అంటూ కొన్ని నెలల కింద కామెంట్ చేశాడు శిఖర్ ధావన్. తాజాగా ఇరానీ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న ఛతేశ్వర్ పూజారాని కూడా ఇదే విధంగా ట్రోల్ చేశాడు గబ్బర్...
2022 ఆరంభంలో ఛతేశ్వర్ పూజారాని టెస్టుల నుంచి తప్పించారు టీమిండియా సెలక్టర్లు. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన పూజారా, రంజీ ట్రోఫీలోనూ ఆడి సెలక్టర్లను మెప్పించాడు. దీంతో అతనికి మళ్లీ టీమ్‌లో చోటు దక్కింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ టెస్టు చేసిన ఛతేశ్వర్ పూజారా.. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు..
అయితే డిసెంబర్‌లో సౌతాఫ్రికాలో జరగబోయే టెస్టు సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్న ఛతేశ్వర్ పూజారా... ఇరానీ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. ‘ఇరానీ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నా.. ’ అంటూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఛతేశ్వర్ పూజారా. ఈ వీడియోపై శిఖర్ ధావన్ ఫన్నీగా కామెంట్ చేశాడు..
‘భాయ్ ఇక చాలు. ఇకనైన యంగ్‌స్టర్‌ని కూడా ఆడనివ్వు. ఇరానీ, నీకు నానీ ట్రోఫీ అయిపోయింది..’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఇరానీ ట్రోఫీ 2023 టోర్నీలో రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర జట్టు, రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌తో తలబడుతుంది..
ఈ ఏడాది మార్చిలో ఇరానీ ట్రోఫీ జరిగింది. ఆ మ్యాచ్‌లో మధ్య ప్రదేశ్‌ని 238 పరుగుల తేడాతో ఓడించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. అక్టోబర్‌లో మరోసారి ఇరానీ ట్రోఫీ జరగనుంది. దీనికి కారణం ఉంది. కరోనా బ్రేక్ కారణంగా 2020-21 సీజన్‌లో రంజీతో పాటు, ఇరానీ ట్రోఫీ కూడా నిర్వహించలేదు...
2021-22 సీజన్‌లో రంజీ ట్రోఫీ నిర్వహించినా, కొన్ని కారణాల వల్ల ఇరానీ ట్రోఫీ నిర్వహించడం వీలు కాలేదు. ఈసారి ఒకేసారి రెండు సీజన్లుగా ఇరానీ ట్రోఫీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో 2021-22 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్య ప్రదేశ్ జట్టుతో రెస్ట్ ఆఫ్ ఇండియా తలబడింది. ఆ తర్వాత 2022-23 రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్ర, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య ఇరానీ కప్ టోర్నీ, అక్టోబర్ 1న జరుగుతుంది..