పార్టీ లేదా భజ్జీ..? హర్భజన్ ను బర్త్ డే పార్టీ అడుగుతున్న టీమిండియా ఓపెనర్

By Srinivas MFirst Published Jul 3, 2022, 3:57 PM IST
Highlights

Harbhajan Singh: 1980 జులై 3న పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన భజ్జీ.. నేడు 42వ  పడిలోకి అడుగుపెడుతున్నాడు. 1998లో ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్ తో అరంగేట్రం చేసిన హర్భజన్.. 2021లో ఆటకు గుడ్ బై చెప్పాడు. 

‘పార్టీ లేదా పుష్ప..’ ఈ డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఫవాద్ ఫజిల్ చెప్పే ఈ డైలాగ్ ఇప్పుడు  పార్టీ కోరుకునే ప్రతి ఒక్కరి నోట్లో నానుతుంది. దానికి  టీమిండియా స్టార్ ఓపెనర్  శిఖర్ ధావన్ కూడా అతీతుడేమీ కాదు. తాజాగా అతడు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను బర్త్ డే పార్టీ అడుగుతున్నాడు. దానికి భజ్జీ రిప్లై కూడా మాములుగా లేదు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ధావన్-భజ్జీ బర్త్ డే పార్టీ గురించి చర్చించుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

హర్భజన్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ క్రికెటర్లు, అతడి సహచరులు భజ్జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో  ధావన్ ఇన్స్టా వేదికగా టర్బోనేటర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ వీడియోను  పోస్టు చేశాడు. 

ఈ వీడియోలో ధావన్.. భజ్జీకి బర్త్ డే విషెస్ చెబుతాడు.  దానికి హర్భజన్ ‘థ్యాంక్యూ.. థ్యాంక్యూ..’ అని అంటాడు. ఆ తర్వాత ధావన్.. ‘భయ్యా మరి  బర్త్ డే పార్టీ..?’ అని అడుగుతాడు. అప్పుడు భజ్జీ ‘మరి గిఫ్ట్ ఏది..? గిఫ్ట్ ఇవ్వు పార్టీ తీసుకో..’అని రిప్లై ఇచ్చాడు. దాంతో ధావన్.. తెల్లముఖం వేసి  ‘సరే.. తర్వాత కలుద్దాం..’ అని అనుకుంటూ  మెల్లిగా జారుకుంటాడు.  ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. 

 

ఇక టీమిండియా మాజీ ఆల్ రౌండర్ భజ్జీతో కలిసి చాలాకాలం  క్రికెట్ ఆడిన యువరాజ్ సింగ్ కూడా హర్భజన్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. ట్విటర్ వేదికగా  అతడు ఓ వీడియోను పోస్టు చేస్తూ.. ‘హ్యపీ బర్త్ డే మై డియర్ బ్రదర్..’ అని రాసుకొచ్చాడు. తామిద్దరూ కలిసి దిగిన పలు పోటోలు, వీడియోలతో కలిపిన వీడియోను యువీ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. 

 

భజ్జీకి బీసీసీఐ కూడా బర్త్ డే విషెస్ చెప్పింది. ‘367 అంతర్జాతీయ మ్యాచ్ లు. 711 వికెట్లు. 3,569 పరుగులు. టెస్టులలో హ్యాట్రిక్ తీసిన తొలి భారత బౌలర్. 2007, 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. హ్యపీ బర్త్ డే హర్భజన్ సింగ్..’ అని ట్వీట్ లో రాసుకొచ్చింది. 

కాగా 1980 జులై 3న పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన భజ్జీ.. నేడు 42వ  పడిలోకి అడుగుపెడుతున్నాడు. 1998లో ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్ తో అరంగేట్రం చేసిన హర్భజన్.. భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. టెస్టులలో 417 వికెట్లు తీశాడు. అంతేగాక 2,224 పరుగులు కూడా చేశాడు. ఇందులో 2 సెంచరీలు 9 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక వన్డేలలో 269 వికెట్లు తీసిన టర్బోనేటర్.. బ్యాటింగ్ లో 1,237 పరుగులు కూడా చేశాడు. టీ20లలో 21 వికెట్లు పడగొట్టాడు. 2016 నుంచి భారత జట్టుకు ఆడని అతడు.. 2021 లో ఆటకు గుడ్ బై చెప్పాడు. భజ్జీ ప్రస్తుతం ఆప్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. 

click me!