IPL 2024 Auction: ఐపీఎల్ 2024 మాక్ ఆక్షన్‌లో మిచెల్ స్టార్క్ (ఆర్సీబీ) రూ.18.5 కోట్ల ధర పలికాడు. డిసెంబర్ 19న జరిగే ఈ ఈవెంట్ కు ముందు జియో సినిమాలో మాక్ వేలం నిర్వహించారు. అక్కడ కొంతమంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
IPL 2024 Mock Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం డిసెంబర్ 19న దుబాయ్ లోని కోకాకోలా ఎరీనాలో జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే, మినీ వేలానికి ముందు వేలం బ్రాడ్కాస్టర్ లలో ఒకటైన జియో సినిమా మాక్ వేలం నిర్వహించింది. ఇందులో పలువురు ఆటగాళ్లు భారీ ధరను పలికారు. ఈ మాక్ ఆక్షన్ లో కొందరు నిపుణులు, మాజీ క్రికెటర్లు తమ అభిమాన జట్లను తీసుకొని వారి తరఫున వేలంలో పాల్గొన్నారు. ఐపీఎల్ మాక్ వేలంలో మిచెల్ స్టార్క్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ.18.5 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. నాలుగో సెట్ అయిన వేలంలో స్టార్క్ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నగెరాల్డ్ కోయెట్జీని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక శార్దూల్ ఠాకూర్ పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లతో దక్కించుకుంది. హ్యారీ బ్రూక్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ. 9.5 కోట్లకు దక్కించుకుంది. ఇక శ్రీలంక ప్లేయర్ వనిందు హసరంగ ను రూ.8.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 224 మాక్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు
ఆటగాడు
|
జట్టు | ధర |
మిచెల్ స్టార్క్ | బెంగళూరు | 18.5 కోట్లు |
గెరాల్డ్ కోయెట్జీ | గుజరాత్ | 18 కోట్లు |
పాట్ కమిన్స్ | హైదరాబాద్ | 17.5 కోట్లు |
శార్దూల్ ఠాకూర్ | పంజాబ్ | 14 కోట్లు |
హ్యారీ బ్రూక్ | గుజరాత్ | 9.5 కోట్లు |
ఐపీఎల్ 2024 వేలంలో 333 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ వేలంలో 10 జట్లలో గరిష్టంగా 77 స్థానాలను భర్తీ చేయడానికి 333 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తం 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో పాల్గొంటారని, వీరిలో కొద్దిమంది మాత్రమే ఈ టోర్నీకి ఎంపికవుతారని తెలిపింది. మిచెల్ స్టార్క్, వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్, న్యూజిలాండ్ దిగ్గజం రచిన్ రవీంద్ర వంటి దిగ్గజ ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. ఇంతకుముందు వేలంలో పంజాబ్ కింగ్స్ సామ్ కరన్ ను రూ.18.5 కోట్లకు దక్కించుకుంది, ఈసారి ఏ ఆటగాడైనా అతడిని దాటుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.