
IPL 2025 MI vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో మరో బిగ్ ఫైట్ జరిగింది. ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడాయి. చివరి వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది.
ఐపీఎల్ 2025 56వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఇరు జట్టు గెలుపు కోసం నువ్వా నేనా అనే విధంగా పోరాడాయి. ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఉత్కంఠభరితమైన పోరు మధ్యలో టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడ్డాయి.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది. అద్భుతమైన బౌలింగ్ తో ముంబై పెద్ద స్కోర్ చేయకుండా గుజరాత్ బౌలర్లు అడ్డుకున్నారు. ముంబై జట్టు ఓపెనర్లు ఇద్దరూ పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. రోహిత్ శర్మ 7 పరుగులు, ర్యాన్ రెకెల్టన్ 2 పరుగులు మాత్రమే చేశారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ మరోసారి గుజరాత్ పై మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తన 53 పరుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అలాగే, సూర్యకుమార్ యాదవ్ 35 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. చివరలో బోష్ 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
156 పరుగుల టార్గెట్ తో సెంకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ కు మంచి ఆరంభం లభించలేదు. వరుసగా హాఫ్ సెంచరీల మోత మోగిస్తున్న సాయి సుదర్శన్ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్ మన్ గిల్, జోస్ బట్లర్ లు గుజరాత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు.
గిల్ 43 పరుగులు, బట్లర్ 30 పరుగులు చేశారు. రూథర్ఫర్డ్ 28 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా వికెట్లు సమర్పించుకోవడంతో గుజరాత్ మళ్లీ కష్టాల్లో పడింది. కీలక సమయంలో షారుక్ ఖాన్ 6, రషద్ ఖాన్ 2, పరుగుల వద్ద అవుట్ అయ్యారు. చివరి రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమైన సమయంలో మళ్లీ వర్షం మొదలైంది.
దీంతో మ్యాచ్ కు మరోసారి బ్రేక్ పడింది. 18 ఓవర్లు ముగిసిన తర్వాత గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. క్రీజులో తేవాటియా 6 పరుగులు, కొయేట్జీ 5 పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్ ఈజీగా గెలిచే మ్యాచ్ ను ముంబై వైపు తీసుకువచ్చింది జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్. కీలకమైన సమయంలో వీరు జీటీ వికెట్లను తీసుకున్నారు.
అయితే, వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ ను 19 ఓవర్లకు తగ్గించారు. దీంతో 147 టార్గెట్ ను గుజరాత్ అద్భుతంగా చివరి బంతికి విజయం సాధించి తన ఖాతాలో మరో రెండు పాయింట్లు వేసుకుంది. ముంబై పై గెలుపుతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది.