బెంగళూరు వర్సెస్ రాజస్థాన్: అగ్రస్థానంపై కోహ్లి, స్మిత్‌ గురి: పరిస్థితులే అసలు సవాల్‌!

By team teluguFirst Published Oct 3, 2020, 12:54 PM IST
Highlights

బెంగళూర్‌, రాజస్థాన్‌లు తొలి మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించాయి.  ముంబయిపై సూపర్‌ విజయంతో బెంగళూర్‌ జోరుమీదుండగా, రెండు వరుస విజయాల తర్వాత రాయల్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. 

ఐపీఎల్‌ 2020లో డబుల్‌ ధమాకాకు వేళైంది. యుఏఈలో రెండు వారాలు గడిచినా, రోజూ ఒక్క మ్యాచే. సీజన్‌లో తొలిసారి ఒకే రోజు రెండు మ్యాచులు జరుగుతున్నాయి. నేడు తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి.  

బెంగళూర్‌, రాజస్థాన్‌లు తొలి మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించాయి.  ముంబయిపై సూపర్‌ విజయంతో బెంగళూర్‌ జోరుమీదుండగా, రెండు వరుస విజయాల తర్వాత రాయల్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. 

సీజన్‌లో ముచ్చటగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై బెంగళూర్‌, రాజస్థాన్‌ కన్నేశాయి. నేడు దుబాయ్‌లో మధ్యాహ్నాం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

అదే అసలు సవాల్!

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏఈ)లో పరిస్థితులు క్రికెటర్లకు కఠిన సవాల్ విసురుతున్నాయి. యుఏఈ కాలమానం ప్రకారం సాయంత్రం మ్యాచులు 6 గంటలకు ఆరంభం అవుతున్నాయి. 

30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆడేందుకు క్రికెటర్లు చెమటలు కక్కుతున్నారు. ముంబయితో మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ ఏకంగా డిహైడ్రేషన్‌కు గురయ్యాడు. మధ్యాహ్నాం మ్యాచులు యుఏఈ కాలమానం ప్రకారం 2 గంటలకు ఆరంభం అవనున్నాయి. 

ఇక్కడ మధ్యాహ్నాం ఉష్ణోగ్రతలు 35-40 డిగ్రీల వరకు ఉంటోంది.  అధిక ఉష్ణోగ్రతల నడుమ క్రికెటర్లు మైదానంలో నిలువగలరా? లేదా? అనేది ఆసక్తికరం. మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లూ పోటీపడడానికి ముందే.. ఇక్కడి పరిస్థితులతో పోరాడాల్సిన పరిస్థితి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతలు కలసికట్టుగా బెంగళూర్‌, రాజస్థాన్‌లకు సవాల్‌ విసురుతున్నాయి.

మూడో విజయంపైనే గురి

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. ఆ జట్టు స్కోరులో 71 శాతం పరుగులు ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లు సాధించారు. మిడిల్‌ ఆర్డర్‌లో ఏబీ డివిలియర్స్‌ అర్థ సెంచరీలతో జోరుమీదున్నాడు. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ ఆ జట్టుకు ఆందోళనగా మారింది. తొలి మూడు మ్యాచుల్లోనూ విరాట్‌ రాణించలేదు. బంతితో చాహల్‌, వాషింగ్టన్‌, జంపాలు రాయల్స్‌కు సవాల్‌ విసిరేందుకు రెఢీగా ఉన్నారు. నవదీప్‌ సైనితో పాటు క్రిస్‌ మోరీస్‌ నేడు పేస్‌ బాధ్యతలు పంచుకునే అవకాశం లేకపోలేదు.

షార్జాలో సూపర్‌ విజయాల అనంతరం పరాజయం చవిచూసిన రాజస్థాన్‌కు.. అబుదాబిలో అనూహ్య ఓటమి ఎదురైంది. బిగ్‌ హిట్టర్లు సంజు శాంసన్‌, జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌లు ముగ్గురూ విఫలమయ్యారు.  

రాయల్స్ బ్యాటింగ్‌ లైనప్‌ ఈ ముగ్గురిపైనే ఆధారపడి ఉంది. వీరు మెరిస్తేనే రాయల్స్‌ గట్టి పోటి ఇవ్వగలదు. మిడిల్‌ ఆర్డర్‌లో రాబిన్‌ ఉతప్ప ఇప్పటి వరకూ మెప్పించే ప్రదర్శన చేయలేదు.  ఫీల్డింగ్‌లో సైతం ఉతప్ప విలువైన క్యాచులు జారవిడిచి, చేయాల్సిన నష్టం చేస్తూనే ఉన్నాడు. నేటి మ్యాచ్‌లోనైనా మెరిసి జట్టులో తన స్థానానికి న్యాయం చేయాలని చూస్తున్నాడు. 

ఇక జోఫ్రా ఆర్చర్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌ల పేస్‌తో కోహ్లిసేనను ఏ మేరకు ఇబ్బందికి గురిచేస్తారో చూడాలి. స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ను కోహ్లి, డివిలియర్స్‌లపై ప్రయోగించేందుకు స్మిత్‌ వ్యూహంతో రెఢీగా ఉన్నాడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌: దేవ్‌దత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, గుర్‌కీరత్‌ సింగ్‌/పార్ధీవ్‌ పటేల్‌, శివం దూబె, క్రిస్‌ మోరీస్‌/ఇసురు ఉదాన, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌, ఆడం జంపా.

రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, రాబిన్‌ ఉతప్ప, మనన్‌ వోహ్రా/రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాటియ, శ్రేయస్ గోపాల్‌, టామ్‌ కరన్, జోఫ్రా ఆర్చర్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌. 

click me!