RCB Vs DC WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DCW) 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తడబడింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులు చేసింది.
RCB vs DC: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో ఏడవ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తడబడింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులు చేసింది. టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది రెండో విజయం కాగా, మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది తొలి ఓటమి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బ్యాటింగ్ చేసిన కెప్టెన్ స్మృతి మంధాన మెరిసింది. 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 74 పరుగులు చేసింది. కానీ మిగతవారు అనుకున్న రీతిలో రాణించకపోవడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. తెలుగమ్మాయి సబ్భినేని మేఘన( 36 పరుగులు) ఫర్వాలేదనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బౌలింగ్‌లో జెస్ జోనాసెన్ 3 వికెట్లు పడగొట్టగా, అరుంధతి రెడ్డి, మారిజానే కాప్ తలో రెండు వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించారు.
భారీ లక్ష్యం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బ్యాటింగ్ చేసిన షెఫాలీ వర్మ దంచికొట్టారు. ఈ ఇన్నింగ్స్ లో ఆమె (50) అర్ధశతకంతో అదరగొట్టింది. ఓపెనర్ మెగ్ లానింగ్ (11) ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు. కానీ, అలిస్ కాప్సే (46), మారిజానే కాప్ (32), జెస్ జోనాస్సెన్ (36*) రాణించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్‌లో సోఫీ డివైన్, నాడిన్ డి క్లెర్క్ చెరో 2 వికెట్లు తీశారు. దీంతోపాటు శ్రేయాంక పాటిల్ ఒక వికెట్ తీసింది.