వీళ్లేంటి మరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లా తయారయ్యారు... రంజీ ఫైనల్‌లో ‘ఆర్‌సీబీ’ ఫ్యాన్స్ గోల గోల...

By Chinthakindhi RamuFirst Published Jun 27, 2022, 4:33 PM IST
Highlights

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో  మధ్యప్రదేశ్ తరుపున ఆడిన రజత్ పటిదార్... స్టేడియంలో ‘ఆర్‌సీబీ’ నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్... 

అభిమానులందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా... తెలుగు సినీ లవర్స్ అందరికీ ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే హీరో ఎవరనేది సంబంధం లేకుండా సినీ ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల గోల చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా ఇలాగే తయారయ్యారని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు, 41 సార్లు టైటిల్ గెలిచిన ముంబైని ఓడించి మొట్టమొదటిసారి విజేతగా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ సమయంలో స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ చాలామంది... మ్యాచ్ జరుగుతున్న సమయంలో ‘ఆర్‌సీబీ... ఆర్‌సీబీ...’ అంటూ నినాదాలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది...

తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు, అభిమానులు అండగా నిలుస్తారని... చప్పట్లతో అభినందిస్తారని కోరుకుంటారు క్రికెటర్లు. అయితే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, సంబంధం లేకుండా ‘ఆర్‌సీబీ... ఆర్‌సీబీ’ అని అరుస్తుంటే, నవ్వాలో ఏడవాలో తెలియక ఉండిపోయారు మధ్యప్రదేశ్ క్రికెట్ టీమ్.. 


ప్రేక్షకులు అంతలా ఆర్‌సీబీ... ఆర్‌సీబీ.... అంటూ అరవడానికి ప్రధాన కారణం రజత్ పటిదార్. ముంబైతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరుపున ఆడిన రజత్ పటిదార్, తొలి ఇన్నింగ్స్‌లో 195 బంతుల్లో 20 ఫోర్లతో 120 పరుగులు చేశాడు... రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు పటిదార్...

ఆర్‌సీబీ ప్లేయర్ ఆడుతుండడంతో బెంగళూరు అభిమానులు, మధ్యప్రదేశ్ జట్టుకి సపోర్ట్ చేయాల్సిందిపోయి... ‘ఆర్‌సీబీ... ఆర్‌సీబీ...’ అంటూ నినాదాలు చేయడంతో ఆ టీమ్ ప్లేయర్లు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఈ విధంగా సంబంధం లేకుండా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు, ఇంతకుముందు విరాట్ కోహ్లీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది...

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ బెంగళూరు వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే, స్టేడియంలో ఉన్న ఓ వర్గం ‘ఆర్‌సీబీ... ఆర్‌సీబీ’ అంటూ కేకలు వేయడం మొదలెట్టారు...

ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో ఆర్‌సీబీ ఒకటి. 15 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ఇప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం ఆర్‌సీబీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతీ సీజన్‌లో ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ అదే ఉత్సాహంతో టీమ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్నిసార్లు నిరుత్సాహపరిచినా సపోర్ట్ చేయడమంటే మాటలు కాదు, వారి లాయల్టీకి ఎంత మెచ్చుకున్నా తక్కువే...

అయితే సంబంధం లేని చోట ఇలా ఆర్‌సీబీ అంటూ నినాదాలు చేయడం వల్ల ఆ ఫ్రాంఛైజీ పేరు కూడా చెడిపోతుంది... ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఫ్యాన్స్ త్వరగా గుర్తిస్తే బాగుంటుందని అంటున్నారు టీమిండియా అభిమానులు... 

click me!