పాక్ క్రికెట్ కు అతడు చేసిన ఒక్క మంచి పని చెప్పండి : పీసీబీ చైర్మన్ పై మాజీ పేసర్ ఫైర్

By Srinivas MFirst Published Jun 27, 2022, 2:59 PM IST
Highlights

Ramiz Raja: గతేడాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా ఎంపికైన రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది కాలంలో అతడు జట్టుకు చేసిన మంచి పని ఒక్కటైనా లేదని.. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గడిచిన 9 నెలల కాలంలో అతడు పాకిస్తాన్ క్రికెట్ కు చేసిన మంచి పని ఒక్కటైనా లేదని వాపోయాడు.  రమీజ్ రాజా పీసీబీ బోర్డు అయ్యాక  పాకిస్తాన్ క్రికెట్ లో వచ్చిన మార్పులేమీ లేవని.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.  

తన యూట్యూబ్ ఛానెల్ లో తన్వీర్ మాట్లాడుతూ.. ‘రమీజ్ రాజా పీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికై దాదాపు 9 నెలలు కావొస్తున్నది.  ఈ 9 నెలల కాలంలో పాకిస్తాన్ క్రికెట్ కు ఉపయోగపడే మంచి పని ఏదైనా ఒక్కటి చేశాడా..? ఒకవేళ చేస్తే అదేంటో నాకు చెప్పండి...’ అని అన్నాడు. 

రమీజ్ రాజా  పీసీబీ చీఫ్ అయ్యాక తాను కూడా పాక్ క్రికెట్ కు మంచిరోజులు వస్తాయని నేను ఊహించానని కానీ అతడు కూడా మాజీ అధ్యక్షుల మాదిరే తప్ప  చెప్పుకోదగ్గ మార్పులేమీ చేయలేదని తెలిపాడు. 

‘రమీజ్ రాజా పీసీబీ చైర్మన్ అయ్యాక నాకు కూడా అతడిమీద భారీ అంచనాలుండేవి. అతడి రాకతో అయినా పాక్ క్రికెట్ లో పరిస్థితులు మారతాయని నేను ఆశించా. కానీ అతడు కూడా ఆ పదవిలో కొనసాగిన మాజీ అధ్యక్షుల మాదిరే తప్ప చేసిన పనైతే ఏదీ లేదు. ఏదో వచ్చామా..? టైమ్ పాస్ చేశామా..? తప్ప  పాక్ క్రికెట్ కు ఆయన వల్ల ఒరిగిందేమీ లేదు..’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు.  జట్టు సెలక్షన్ మిషయంలో  పీసీబీ వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవలే డానిష్ కనేరియా కూడా బోర్డు, రమీజ్ రాజాను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్ లో నిస్సార పిచ్ లను తయారుచేసినప్పుడు కూడా బోర్డు విమర్శల పాలైంది. 

రమీజ్ రాజా.. గతేడాది సెప్టెంబర్ లో ఈ పదవి చేపట్టాడు. నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. రమీజ్ ను పీసీబీ చీఫ్ కుర్చీ ఎక్కించాడు. టీ20లలో విజయాలు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన మినహా ఈ 9 నెలల కాలంలో పాకిస్తాన్ జట్టు గొప్పగా సాధించిన విజయాలేమీ లేవు. ఇటీవలే ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ లో 3 టెస్టులు, 3 వన్డేలు, 1 టీ20 ఆడింది. టెస్టు సిరీస్ ను ఆసీస్ 1-0తో గెలుచుకుంది. వన్డే సిరీస్ ను పాక్ నెగ్గగా.. టీ20 ఆసీస్ వశమైంది. 

ఇక ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ దిగిపోయిన తర్వాత  రమీజ్ రాజా పదవి కూడా పోతుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇమ్రాన్.. పాక్ ప్రధాని పదవి నుంచి తప్పుకుని రెండు నెలలు గడిచినా రమీజ్ మాత్రం తన పదవిలోనే కొనసాగుతున్నాడు. దీనిపై ఇటీవలే అతడు మాట్లాడుతూ.. తాను పీసీబీ చీఫ్ గా దిగిపోతాననడం ఊహాగానాలేనని,  అవి ఎక్కువకాలం మనజాలవని రమీజ్  చెప్పాడు. 

click me!