మాట మార్చిన రవీంద్ర జడేజా... అలా పిలవొద్దంటూ విన్నపం! ముఖం చూసి ఎవ్వరూ తీసుకోరు...

By Chinthakindhi RamuFirst Published Feb 17, 2023, 10:49 AM IST
Highlights

సర్ అని పిలిస్తే తనకు మా చెడ్డ చిరాకు అంటున్న రవీంద్ర జడేజా... కంప్యూటర్ ముందు కూర్చొని మీమ్స్ చేసేవాళ్లకేం తెలుసు, మేం పడుతున్న కష్టమంటూ కామెంట్..

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, దాదాపు ఐదు నెలల తర్వాత టీమిండియా తరుపున రీఎంట్రీ ఇచ్చాడు. నాగ్‌పూర్ టెస్టులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, బ్యాటింగ్‌లో 70 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన జడ్డూ... రెండో టెస్టుకి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

‘కెరీర్ ఆరంభం నుంచి నాకు ట్రోల్స్ కొత్తేమీ కాదు. నేను బాగా ఆడినప్పుడు కూడా నన్ను ట్రోల్ చేశారు. అందుకే అప్పుడు ఆ కోపాన్ని సోషల్ మీడియాలో చూపించేవాడిని. నేను ఎంత కష్టపడుతున్నానో తెలియకుండా ఎందుకు నన్ను ఇలా జడ్జ్ చేస్తారో అర్థమయ్యేది కాదు. 

Latest Videos

ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలు చేసి ఇక్కడిదాకా వచ్చాను. చిన్న చిన్న విషయాలను పట్టుకుని నన్ను తిడుతూ ట్రోల్ చేస్తుంటే తట్టుకోలేకపోయేవాడిని. కంప్యూటర్ ముందు కూర్చున్న వాళ్లకి, గ్రౌండ్‌లో ఆడాలంటే ఎంత కష్టపడాలో ఎలా తెలుస్తుంది...

చాలామంది ఇంట్లో కూర్చొని, మీమ్స్ చేస్తారు. వాళ్లకు తోచింది రాసుకొస్తారు. ఆ చిన్న విషయాలు కూడా నన్ను ఎంతో బాధపెడతాయి. అయితే ఒక్కటి, వాళ్లు అలా ట్రోల్ చేయకపోయి ఉంటే, నేను ఇంత దూరం వచ్చే వాడిని కాదేమో. నాపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని మరింత కష్టపడ్డాను..

ఐపీఎల్ ఆడుతూ కోట్లు సంపాదిస్తున్నావని చాలామంది అంటారు. కానీ ఏ ఫ్రాంఛైజీ కూడా మన ముఖం చూసి, కోట్లు పెట్టి కొనుక్కోరు. బాగా ఆడితేనే కొంటారు... నన్ను చాలామంది సర్ జడేజా అని పిలుస్తూ ఉంటారు. అలా పిలిస్తే నాకు చిరాకు. నాకు ఆ పేరు ఏ మాత్రం నచ్చదు...

మరీ అంతలా పిలవాలని అనుకుంటే, ‘బాపు’ అని పిలవండి. అది నాకు దగ్గరైనట్టు ఉంటుంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా..

కెరీర్ ఆరంభంలో రవీంద్ర జడేజా ట్విట్టర్ అకౌంట్‌ని హ్యాక్ చేసిన కొందరు ‘సర్’ రవీంద్ర జడేజా అని పేరును జత చేశారు. జడ్డూకి ఆ పేరు నచ్చడంతో ‘సర్’ రవీంద్ర జడేజా అనే పేరుని చాలా ఏళ్ల పాటు అలాగే కొనసాగించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా జడ్డూని ‘సర్ జడేజా’ అని ముద్దుగా పిలుస్తుండేవాడు.

‘రజినీ సర్‌కి వయసు అయిపోతుందని తెలుసుకున్న దేవుడు, సర్ రవీంద్ర జడేజాని పుట్టించాడు...’ ‘సర్ జడేజా క్యాచ్ పట్టేందుకు బాల్ దగ్గరికి పరుగెత్తడు. బంతే, అతని దగ్గరికి వచ్చి తన చేతుల్లో వాలుతుంది..’ అంటూ ధోనీ చేసిన పాత ట్వీట్లు ఇప్పటికీ తెగ వైరల్ అవుతుంటాయి..  అప్పుడు ‘సర్’ అని పిలవాలని కోరుకున్న జడ్డూ, ఇప్పుడు మాత్రం అలా పిలవకండంటూ కోరడం విశేషం..

గాయం వంకతో జట్టుకి దూరమైన రవీంద్ర జడేజా, తన భార్య రివాబా ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నాడు. భార్యను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత తిరిగి జట్టుతో కలిశాడు. 

click me!