
బుధవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య ముగిసిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ విధ్వంసం ఎస్ఆర్హెచ్ కు విజయాన్ని దూరం చేశాయి. ఆఖరి నాలుగు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి గుజరాత్ కు విజయం అందించిన అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేస్తుండగా అతడు కొట్టే షాట్లు విచిత్రంగా ఉంటాయి. ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్ల మాదిరే అనిపించినా వాటికీ ఓ ప్రత్యేకత ఉంది. బంతిని బాదిన వెంటనే రషీద్.. ఎంత ఫోర్స్ తో దానిని ముందుకు తీసుకెళ్లాడో అదే ఫోర్స్ తో వెనక్కి తీసుకొస్తాడు. ఈ తరహా బ్యాటింగ్ శైలికి అతడు పెట్టుకున్న పేరు ‘స్నేక్ షాట్’.. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
గుజరాత్-హైదరాబాద్ మ్యాచ్ అనంతరం హార్ధిక్ పాండ్యా.. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ తో కాసేపు మాట్లాడాడు. ఇందులో పాండ్యా.. రషీద్ ను ఈ షాట్ గురించి అడిగాడు. దానికి రషీద్ సమాధానం చెబుతూ.. ‘నేను దానిని స్నేక్ (పాము) షాట్ అని పిలుస్తాను. పాము ఒకరిని కాటేసిన తర్వాత వెంటనే వెనక్కి జరుగుతుంది కదా..
నేనూ అంతే.. బంతి దూసుకొచ్చిన సమయంలో నా బాడీ పొజిషన్ సరిగా లేకుంటే నేను ఆ షాట్ సరిగా ఆడలేను. ఆ బంతిని అంచనా వేసిన తర్వాత రిస్ట్ పవర్ (మణికట్టు) ఉపయోగించి బాదితే దానికి తిరుగుండదనే విషయం నాకు తర్వాత అర్థమైంది..’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఐపీఎల్ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
రషీద్ చెప్పినట్టు.. పాము ఎవర్నైనా కాటు వేస్తే అది అక్కడ ఉండదు. వెంటనే పడగను అక్కడ్నుంచి రెప్పపాటు క్షణంలో వెనక్కి తీసుకుని అక్కడ్నుంచి జారుకుంటుంది. రషీద్ బ్యాటింగ్ కూడా అంతే.. బౌలర్ స్పిన్నర్ అయినా పేసర్ అయినా.. బంతి బ్యాట్ కు అనుకువగా వస్తే అది ఏ పొజిషన్ లో వచ్చినా దానిని అటువైపే బాదుతాడు. బాదిన వెంటనే బ్యాట్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాడో అదే క్రమంలో మళ్లీ వెనక్కి తీసుకొస్తాడు. ఆలోపే బంతి స్టాంట్స్ లో ఉంటుంది.
ఇక బుధవారం నాటి మ్యాచ్ లో జాన్సేన్ వేసిన ఆఖరి ఓవర్లో రాహుల్ తెవాటియా.. 6, 1, కొట్టి రషీద్ కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు.. 6, 0, 6, 6 బాది సన్ రైజర్స్ ఓటమిని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్ లో రషీద్ మొత్తంగా 11 బంతులే ఎదుర్కుని 31 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (65), మార్క్రమ్ (56), శశాంక్ సింగ్ (25 నాటౌట్) లు రాణించారు. లక్ష్య ఛేదనలో గుజరాత్.. 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్లో చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు రషీద్ ఖాన్. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఇన్నింగ్స్ ను దెబ్బతీసి 5 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.