
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అంటే.. క్రికెట్ ప్రియులకు మాత్రమే కాదు... సహచర క్రికెటర్లకు కూడా మర్యాద ఎక్కువగా ఉండేది. వాళ్లు ఎంత మర్యాదగా ఉన్నా... సచిన్ మాత్రం వాళ్లతో సరదాగానే ఉండేవారు. ఓ సందర్భంలో సచిన్ తనదైన చతురతతో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ ఒత్తిడిని దూరం చేశాడని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ హేమంగ్ బదానీ ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోలో గుర్తు చేసుకున్నాడు.
‘2002లో కటక్‌లో ఇంగ్లండ్‌తో వన్డే సందర్భంగా శ్రీనాథ్ ఏదో తెలియని ఆందోళనలో ఉన్నాడు. గమనించిన సచిన్.. అతడిని ఒత్తిడిలో నుంచి బయటపడేయాలనుకున్నాడు. అందుకోసం నా సాయం తీసుకున్నాడు. తన ప్యాంట్‌ను శ్రీనాథ్ బ్యాగులో ఉంచమని.. అతడి ప్యాంట్‌ను తీసి మరో చోట పెట్టమని చెప్పాడు. శ్రీనాథ్‌ను స్థిమిత పరిచే ఉద్దేశంతోనే అలా చేయమన్నాడు. కానీ, పొడగరి అయిన శ్రీనాథ్.. ప్రాక్టీస్ తర్వాత ఏమీ పట్టించుకోకుండా సచిన్ ప్యాంట్ వేసుకొని మైదానంలోకి వచ్చాడు. తొలి ఓవర్ కూడా వేశాడు. శ్రీనాథ్ పొట్టి ప్యాంట్ ధరించిన విషయాన్ని గమనించిన ప్రేక్షకులు సరదాగా నవ్వుకున్నారు. టీమ్‌లో ఎవరో ప్యాంట్ గురించి చెబితేగానీ శ్రీనాథ్ గమనించలేదు. దీంతో మధ్య లో వెళ్లి మార్చుకుని వచ్చాడు. కానీ, ఈ సంఘటన వల్ల అక్కడి వాతావరణం తేలిక పడింద’ని బదానీ చెప్పాడు. అప్పటి వరకూ ఆందోళనగా కనిపించిన శ్రీనాథ్.. ఒత్తిడి దూరం కావడంతో అద్భుతంగా బౌలింగ్ చేసినట్టు తెలిపాడు.