బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ.. కోహ్లీతో పోల్చుకునే బాబర్‌కు వచ్చే వార్షిక వేతనమెంతో తెలుసా..

By Srinivas MFirst Published Mar 30, 2023, 5:43 PM IST
Highlights

BCCI Annual Contracts: జింబాబ్వే, వెస్టిండీస్ ల మీద సెంచరీలు చేసినా   పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ను  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పోల్చుతారు అక్కడి మాజీలు.  

పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ శతకమో లేక  మెరుగైన ప్రదర్శన  చేసినప్పుడో అక్కడి  మాజీ క్రికెటర్లు ‘మా కెప్టెన్ తోపు, తురుము..’ అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తారు.   వీరిలో కొంతమంది  ‘కోహ్లీ కంటే మావోడు  స్ట్రైయిట్ డ్రైవ్, ఆఫ్ కట్ డ్రైవ్స్ బాగా చేస్తాడు. బాబర్ టెక్నిక్ కోహ్లీ కంటే బాగుంటుంది’ అని  కామెంట్స్ చేస్తుండగా మరికొంతమంది మాత్రం కాస్త పద్ధతిగా  ‘కోహ్లీ గొప్ప బ్యాటర్. ఆ తర్వాత   నెంబర్ వన్ అయ్యేది మాత్రం బాబరే..’అని చెప్పుకుంటారు.  ఎవరెన్ని చెప్పినా  ఆటలోనే కాదు ఆదాయంలో కూడా బాబర్  కోహ్లీకి దరిదాపుల్లోకి రాడనేది   అభిమానులే కాదు గణాంకాలూ చెబుతున్న వాస్తవం.. 

తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. కమర్షియల్ యాడ్స్,  లీగ్ లు, ఇతరత్రా ఆదాయల సంగతి పక్కనబెడితే   బోర్డు నుంచి వచ్చే సంపాదనలో కూడా బాబర్ కంటే  కోహ్లీ ఎన్నో రెట్లు ముందంజలో ఉన్నాడు.   పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  (పీసీబీ) తాజాగా విడుదల చేసిన వార్షిక కాంట్రాక్టు ద్వారా  ఈ విషయం మరోసారి నిరూపితమైంది. 

పీసీబీ తాజాగా  ఆ జట్టు వార్షిక కాంట్రాక్టుల జాబితాను వెల్లడించింది.  టాప్ కేటగిరీలో  ఉన్న బాబర్ కు ఏడాదికి దక్కుతున్న వేతనం  1.25 మిలియన్   పీకేఆర్ (పాకిస్తాన్ రూపీ)  గా ఉంది. అంటే భారత   కరెన్సీలో చెప్పాలంటే  సుమారు రూ. 43 లక్షల 53 వేలు.   బీసీసీఐ ఇటీవల ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో  గ్రేడ్ ‘ఎ ప్లస్’ కేటగిరీలో ఉన్న  కోహ్లికి దక్కుతున్న వేతనం యేటా రూ. 7 కోట్లు.  అంటే  బాబర్ కంటే  కోహ్లీకి ఏడాదికి  16 రెట్ల వేతనం  అధికంగా లభిస్తున్నది.

కోహ్లీతో  కాదు కదా..  బీసీసీఐ  గ్రేడ్ ‘సి’ క్రికెటర్లకు అందించేదానితో పోల్చినా  ఇది సగానికి తక్కువ.  గ్రేడ్ సి క్రికెటర్ల జాబితాలో ఉన్న శిఖర్ ధావన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్.. ఇటీవలే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న  ఆంధ్రా కుర్రాడు కెఎస్ భరత్  కు కూడా ఏడాదికి  కోటి రూపాయల వేతనం అందుతుంది. కానీ బాబర్ కు అందేది  రూ. 43 లక్షలే.  ఇక బాబర్ తో పాటు  పాకిస్తాన్ క్రికెటర్లలో మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది,   హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్ లకు  రెడ్, వైట్ బాల్ కాంట్రాక్టులు దక్కాయి.  

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ (2022-23) పూర్తి లిస్టు:

Grade A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా  (రూ. 7 కోట్లు) 

Grade A: హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ (రూ. 5 కోట్లు) 

Grade B: ఛతేశ్వర్ పూజారా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్ (రూ. 3 కోట్లు)

Grade c: ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్ (కోటి రూపాయలు) 

click me!