
ఈ మధ్య కాలంలో ఆసియా కప్ 2023 టోర్నీ గురించి జరిగినంత హై డ్రామా, ట్విస్టులు మరే సిరీస్ గురించి జరగలేదు. అప్పుడెప్పుడో ఆగస్టు 2022లో పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ టోర్నీ గురించి కామెంట్లు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ‘ఆసియా కప్ 2022 టోర్నీ కోసం ఇండియా, పాకిస్తాన్‌కి వెళ్లదు. తటస్థ వేదికపై ఆసియా కప్ టోర్నీని నిర్వహిస్తాం...’ అంటూ వ్యాఖ్యానించాడు జై షా...
ఆసియా కప్ 2023 కోసం ఇండియా, పాకిస్తాన్‌కి రాకపోతే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాక్, ఇండియాలో అడుగుపెట్టదని అప్పటి పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కామెంట్లు చేయడంతో ఉత్కంఠ రేగింది. ఏడాదిలో పాక్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ పొజిషన్‌లో ముగ్గురు వ్యక్తులు మారడం... కొత్త పీసీబీ ఛైర్మెన్ వచ్చిన ప్రతీసారీ హై డ్రామా రేగింది..
ఎట్టకేలకు హై బ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహించబోతున్నట్టు ఏషియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. జూలై 15న పీసీబీ, ఏషియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ని ఖరారు చేసేశారు. జూలై 19న ఆసియా కప్ 2023 టోర్నీ షెడ్యూల్‌ని విడుదల చేయబోతున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసింది..
పీసీబీ ఛీఫ్ జకా ఆష్రఫ్, ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ని మీడియాకి విడుదల చేయబోతున్నారు. నజం సేథీ తర్వాత పీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న జకా ఆష్రఫ్, పాకిస్తాన్‌లో ఎక్కువ మ్యాచులు జరపాల్సిందిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ని కోరాడు. అయితే ముందుగా నిర్ణయించిన 4-9 మోడల్‌ని మార్చలేమని ఏసీసీ తేల్చి చెప్పేసింది..
దీంతో పాకిస్తాన్‌లో 4 మ్యాచులు, శ్రీలంకలో 9 మ్యాచులు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు. శ్రీలంకలోని దంబుల్లాలో సెప్టెంబర్ 2న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. గ్రూప్ A లో ఇండియా, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ జట్టు, తొలిసారి ఆసియా కప్ ఆడబోతోంది.
దీంతో నేపాల్ సంచలనం క్రియేట్ చేయకపోతే ఇండియా, పాకిస్తాన్ సూపర్ 4కి అర్హత సాధించడం గ్యారెంటీ. ఇదే జరిగితే సెప్టెంబర్ 10న మరోసారి సూపర్ 4 రౌండ్‌లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది.