
మాజీ క్రికెటర్, చిన్న వయస్సులోనే క్రికెట్ అరంగ్రేటం చేసిన భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ కు కోలుకోలేని షాక్. ఆయన తండ్రి అజయ్ బాయ్ బిపిన్ చంద్ర పటేల్ (Ajaybhai Bipinchandra Patel) ఆదివారం అహ్మదాబాద్ లో కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థీవ్ పటేలే ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. 2019 నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బిపిన్ చంద్ర.. ఆదివారం పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.
పటేల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘నా తండ్రి అజయ్ భాయ్ బిపిన్ చంద్ర ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన ఆత్మను మీ ప్రార్థనలతో ప్రశాంతంగా ఉంచమని మేము అభ్యర్థిస్తున్నాము’ అని పేర్కొన్నాడు.
కాగా, బిపిన్ చంద్ర మరణవార్త విన్న భారత క్రికెట్ జట్టు తాజా, మాజీలు పటేల్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా, సీమర్ ఆర్పీ సింగ్ తో పాటు పలువురు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సంతాపం తెలిపారు.
ధోని రాకతో భారత క్రికెట్ నుంచి కనుమరుగయ్యాక పార్థీవ్ ఐపీఎల్ లో అదరగొట్టాడు. 36 ఏండ్ల పార్థీవ్.. ముంబయి ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ప్రస్తుతం ఆర్సీబీకి సేవలందిస్తున్నాడు.