రిషబ్ పంత్‌ని కాపాడిన బస్ డ్రైవర్... బయట పడిన డబ్బులు కూడా తీసి అతనికే ఇచ్చి...

By Chinthakindhi RamuFirst Published Dec 30, 2022, 3:46 PM IST
Highlights

రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్‌ని ప్రత్యక్ష్యంగా చూసిన బస్సు డ్రైవర్... అతని దగ్గరికి వెళ్లి, అంబులెన్స్‌కి ఫోన్ చేసినట్టు మీడియాకి తెలిపిన ప్రత్యేక్ష సాక్షి.. 

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. రిషబ్ పంత్‌ కారు ప్రమాదానికి గురైన తర్వాత అక్కడికి చేరుకున్న జనాలు సాయం చేయడానికి బదులుగా, అతని దగ్గర ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి...

అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కారు ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ప్రత్యేక్ష సాక్షి ఓ బస్సు డ్రైవర్ చెప్పిన కథనం ప్రకారం రిషబ్ పంత్‌ దగ్గర యాక్సిడెంట్ సమయంలో చాలా డబ్బు ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ డబ్బు కూడా చెల్లాచెదురుగా పడిపోయింది...

‘అతివేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌కి ఢీకొని పల్టీకొట్టడం నేను చూశాను. వెంటనే బస్సును పక్కకు ఆపి దగ్గరికి వెళ్లి చూశాను. రిషబ్ పంత్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనే లేచి కారులో నుంచి బయటికి వచ్చాడు. రిషబ్ పంత్ దగ్గరికి వెళ్లి కింద కూర్చోబెట్టాను...

ముఖమంతా రక్తం కారిపోతూ ఉంది. నా దగ్గరున్న ఓ రగ్గుతో అతనికి చుట్టాను. అప్పటికి అతను ఇంకా స్పృహలోనే ఉన్నాడు. తన గురించి, తన వారి గురించి చెబుతున్నాడు. నేను వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేశాను...  ఆ సమయంలో అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కారు బోల్తా కొట్టడంతో అవన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిని తీసి బ్యాగులో వేసి అతనికే ఇచ్చాను...’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రత్యేక్ష సాక్షి బస్సు డ్రైవర్...
 

కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్‌ని వెంటనే పక్కనే ఉన్న సాక్ష్యం మల్లీస్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రిషబ్ పంత్‌ని డెహ్రాడూన్‌కి తరలించారు...

డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు రిషబ్ పంత్. మధ్యాహ్నం 12-1 గంటల సమయంలో రిషబ్ పంత్‌ మెలకువలోకి వచ్చాడని, వైద్యులతో మాట్లాడాడని సమాచారం. అతని తీసిన ఎక్స్‌రేలో ఎలాంటి ఎముక విరగలేదని, ఫ్రాక్చర్స్‌ ఏవీ లేవని తేలింది...

తాజాగా బీసీసీఐ, రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి కూడా బులెటిన్ విడుదల చేసింది. రిషబ్ పంత్‌ నుదుటిన రెండు కాట్లు పడ్డాయని తెలియచేసిన బీసీసీఐ, కుడి మోకాలికి గాయమైందని తెలిపింది. అలాగే అతని కుడి మోచేతికి, పాదానికి, బొటనవేలికి కూడా గాయాలైనట్టు స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చింది బీసీసీఐ.

click me!