పాకిస్తాన్‌కి చావోరేవో! సౌతాఫ్రికాకి ఛేజింగ్ గండం... చెన్నైలో బాబర్ సేన వీరంగం సృష్టిస్తుందా...

By Chinthakindhi Ramu  |  First Published Oct 27, 2023, 1:56 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్... మొదటి ఐదింట్లో నాలుగు సార్లు తొలుత బ్యాటింగ్ చేసి గెలిచిన సౌతాఫ్రికా, రెండోసారి బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతుల్లో చిత్తు.. 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు సౌతాఫ్రికా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్, బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఇప్పటిదాకా 5 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంటే, పాకిస్తాన్ ఐదింట్లో రెండే విజయాలు అందుకుంది..

తొలి రెండు మ్యాచుల్లో నెదర్లాండ్స్, శ్రీలంకలపై ఘన విజయాలు అందుకున్న పాకిస్తాన్, ఆ తర్వాత వరుస హ్యాట్రిక్ మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఆఖరి మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘాన్‌పై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది..

Latest Videos

అయితే మరోవైపు సౌతాఫ్రికా ఇప్పటిదాకా వన్డే వరల్డ్ కప్‌లో గెలిచిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చినవే. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 207 పరుగులకి ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా. దీంతో పాకిస్తాన్‌తో మ్యాచ్, సౌతాఫ్రికాకి మరో ఛేజింగ్ పరీక్ష కానుంది.

పాకిస్తాన్ ఇప్పటికే 3 మ్యాచుల్లో ఓడడంతో సెమీస్ ఆశలు కాస్తో కూస్తో సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి తీరాల్సిందే. పాకిస్తాన్‌కి లక్ ఎక్కడి నుంచి ఎలా కలిసి వస్తుందో చెప్పలేం. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇదే సౌతాఫ్రికా, ఊహించని విధంగా నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓడడంతో లక్కీగా సెమీ ఫైనల్‌కి వెళ్లింది. ఈసారి కూడా సఫారీ టీమ్ బ్యాడ్ లక్, పాక్‌కి అదృష్టం తెచ్చిపెడితే.. ఏమైనా జరగొచ్చు..

గాయంతో గత రెండు మ్యాచులకు దూరంగా ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా నేటి మ్యాచ్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇప్పటిదాకా అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చిన భవుమా, నేటి మ్యాచ్‌లో రాణించి తీరాల్సిందే. 

సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, తెంబ భవుమా (కెప్టెన్), రస్సీ వాన్ దేర్ దుస్సేన్, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసీ, లుంగి ఇంగిడి

పాకిస్తాన్ జట్టు: అబ్దుల్లా షెఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిదీ, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్

click me!