పాక్ క్రికెటర్ల మెనూ నుండి బిర్యానీ ఔట్... కొత్త కోచ్ మిస్బా నిర్ణయం

By Arun Kumar PFirst Published Sep 17, 2019, 6:10 PM IST
Highlights

పాకిస్థాన్ క్రికెటర్లు ఇకపై బిర్యానీకి దూరం కానున్నారు. ఆటగాళ్ల డైట్ ప్లాన్ ను కొత్తగా రూపొందించిన నూతన చీఫ్ కోచ్  మిస్బా ఆయిల్ ను ఎక్కువగా కలిగివుండే బిర్యానీకి దూరంగా వుండాలని సూచించాడు.  

పాకిస్థాన్ క్రికెట్ టీం చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మిస్బావుల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ ఆటగాళ్ల ప్రదర్శనలో మార్పు రావాలంటే ముందుగా వారి ఆహారపు అలవాట్లను మార్చాలనుకున్నట్లున్నాడు.  అందుకోసమే ఆటగాళ్ల మెనూలోంచి బిర్యాని, స్వీట్లను తొలగించాడు. తన నిర్ణయాన్ని ఉళ్లంఘించిన ఆటగాళ్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించాడు. 

మిస్బా పాక్ టీంకు కేవలం చీఫ్ కోచ్ మాత్రమే కాదు చీఫ్ సెలెక్టర్ కూడా. దీంతో అతడి నిర్ణయాన్ని ఆటగాళ్లెవరూ ఉళ్లంఘించే ఆస్కారం లేదు. కాబట్టి పాకిస్థాన్ ఆటగాళ్లు ఇకపై బిర్యానీకి పూర్తిగా దూరం కానున్నారన్నమాట. 

ఇటీవల  ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ లో పాకిస్థాన్ టీం ఘోరంగా విఫలమయ్యింది. కనీసం నాకౌట్ దశనే దాటలేకపోయింది. అంతేకాకుండా చిరకాల ప్రత్యర్ధి భారత్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన ఆ జట్టు అభిమానుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఆటగాళ్ల ఆహారం, డైటింగ్ విషయంపై తీవ్ర  చర్చ జరిగింది. కొందరు ఆటగాళ్లు పిజ్జాలు తింటున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాగే షోయబ్ మాలిక్ మ్యాచ్ కు ముందురోజే భార్య సానియాతో కలిసి అర్థరాత్రి డిన్నర్ కు వెళ్లాడు. ఇలా ఆహారం కోసం జట్టు ప్రయోజనాలను గాలికొదిలేశారంటూ పాక్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

దీన్ని దృష్టిలో వుంచుకునే మిస్బా తాజాగా ఆటగాళ్ల ఆహారం విషయంలో సీరియస్ డెసీషన్ తీసుకున్నాడు.  మరీ ముఖ్యంగా మ్యాచ్‌లు జరిగే సమయంలో కొవ్వును పెంచే బిర్యానీ, స్వీట్లు వంటి పదార్థాలకు ఆటగాళ్లు దూరంగా వుండాలని సూచించాడు. ఈ మేరకు టీం మేనేజ్ ‌మెంట్ ఆటగాళ్ల ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు  తీసుకోవాలని మిస్బా ఆదేశించారు. 

click me!