క్రికెట్ కు గుడ్ బై: కంట తడి పెట్టిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్

By telugu teamFirst Published Oct 17, 2020, 10:45 AM IST
Highlights

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ క్రికెట్ కు చెందిన అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. రిటైర్మెంట్ అయన తర్వాత ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ట్విట్టర్ వేదికగా తన అబిప్రాయాన్ని పంచుకున్నాడు.

కరాచీ: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ క్రికెట్ క్రీడకు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. రావల్పిండిలో దక్షిణ పంజాబ్ మీద జరిగిన మ్యాచ్ తర్వాత 36 ఏళ్ల ఉమర్ గుల్ తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించారు. 

గుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెలూచిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. రెండు ఓవర్లు వేసిన ఉమర్ గుల్ 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చే సమయంలో అతను కంట తడి పెట్టడం కనిపించింది.

ఉమర్ గుల్ 130 వన్డేలు ఆడి 179 వికెట్లు తీసుకున్నాడు. 47 టెస్టు మ్యాచులు ఆడిన ఉమర్ గుల్ మొత్తం 163 వికెట్లు పడగొట్టాడు. వసీం ఆక్రమ్, వకార్ యూనిస్ తమ కెరీర్ ను ముగించే దశలో పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్న సమయంలో గుల్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.

ఉమర్ గుల్ క్రికెట్ లో నిలకడగా రాణించాడు. యార్కర్లను సంధించడంలో ఆయన దిట్ట. టీ20 తొలి ప్రపంచ కప్ పోటీల్లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచులో ఆడాడు. ఈ పోటీల ఫైనల్లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓటమి పాలయింది. 

రెండేళ్ల తర్వాత జరిగిన పోటీల్లో ఉమర్ గుల్ అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నమెంటును పాకిస్తాన్ గెలుచుకుంది. టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 2008లో జరిగిన తొలి ఐపిఎల్ మ్యాచులో అతను కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. ఆరు మ్యాచులు ఆడి 12 వికెట్లు తీసుకున్నాడు. 

ఎంతగానో ఆలోచించిన తర్వాత భారమైన హృదయంతో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఉమర్ గుల్ ట్విట్టర్ వేదికగా చెప్పాడు. హృదయపూర్వకంగా వంద శాతం కఠిన శ్రమతో తాను పాకిస్తాన్ కోసం ఆడినట్లు తెలిపాడు. 

click me!