ఇండియాపైనే కాదు, ఇంగ్లాండ్‌పైనే అదే ఫీటు... కొండంత లక్ష్యాన్ని ఊదేసిన పాక్ ఓపెనర్లు...

By Chinthakindhi RamuFirst Published Sep 23, 2022, 9:29 AM IST
Highlights

తొలి వికెట్‌కి 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన బాబర్ ఆజమ్- మహ్మద్ రిజ్వాన్... రెండో టీ20లో ఇంగ్లాండ్‌పై పాక్ ఘన విజయం..

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఇండియాపై 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ చేతుల్లో టీమిండియాకి ఎదురైన తొలి పరాజయం ఇదే. టీమిండియా, పాక్ చేతుల్లో ఓడింది అనేదాని కంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా ఓడిపోవడమే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌ని కలిచి వేసింది. అయితే అదేదో గాలివాటుగా వచ్చిన విజయం కాదని మరోసారి నిరూపించుకుంది పాకిస్తాన్. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మరోసారి ఈ ఫీట్ రిపీట్ చేశాడు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్...

తొలి టీ20లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, రెండో టీ20లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేయగా ఫిలిప్ సాల్ట్ 27 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు...


డేవిడ్ మలాన్‌ని దహానీ గోల్డెన్ డకౌట్ చేయగా బెన్ డక్కెట్ 22 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసి నవాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. హారీ బ్రూక్ 19 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 31 పరుగులు చేయగా జోస్ బట్లర్ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మొయిన్ ఆలీ 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సామ్ కుర్రాన్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేశాడు.

200 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాకిస్తాన్, వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించేసింది. మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేయగా కెప్టెన్ బాబర్ ఆజమ్ 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు...

బాబర్ ఆజమ్‌కి ఇది రెండో టీ20 సెంచరీ కాగా కెప్టెన్‌గా టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు పాక్ కెప్టెన్. లక్ష్యఛేదనలో ఓపెనింగ్ వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2021లో సౌతాఫ్రికాపై 197 పరుగులు చేసిన బాబర్ ఆజమ్- మహ్మద్ రిజ్వాన్, ఆ రికార్డును బ్రేక్ చేశారు.

ఈ సెంచరీతో టీ20ల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న బాబర్ ఆజమ్, క్రిస్ గేల్ తర్వాత అత్యధిక వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. క్రిస్ గేల్ 213 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు అందుకోగా 218 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన బాబర్ ఆజమ్, 333 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 10,904 పరుగులు చేసి విరాట్ కోహ్లీకి చేరువగా వచ్చేశాడు...

click me!