ఐసీయూలో పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్... కరోనా బారిన పడి, లండన్‌లో వెంటిలేటర్‌పై...

By Chinthakindhi RamuFirst Published Jun 22, 2022, 1:52 PM IST
Highlights

కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్.. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూకి తరలించి చికిత్స... 

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 74 ఏళ్ల జహీర్ అబ్బాస్, కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో లండన్, సిటీ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్‌లోని సెయింట్ మేరీ ఆసుపత్రిలో చేరాడు జహీర్ అబ్బాస్...

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న జహీర్ అబ్బాస్‌ని ఐసీయూకి తరలించిన వైద్య సిబ్బంది, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదట పడిందని, అయితే పూర్తిగా కోలుకోవడానికి మూడు రోజుల దాకా సమయం పడుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

దుబాయ్‌కి నుంచి ఇంగ్లాండ్‌కి వెళ్తున్న సమయంలో జహీర్ అబ్బాస్, కోవిద్-19 బారిన పడ్డాడు. లండన్ చేరుకున్న తర్వాత కిడ్నీల్లో నొప్పితో పాటు న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు ఈ పాక్ మాజీ కెప్టెన్...

‘ప్రస్తుతం జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అయితే కొన్ని రోజుల పాటు ఎవ్వరినీ కలవనివ్వకుండా చూడాలని వైద్యులు సూచించారు...’ అంటూ తెలియచేశాయి పాక్ న్యూస్ ఛానెల్స్... జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్, త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించాడు...

Wishing speedy recovery & complete health to Zaheer Abbas sb. Get well soon. Aameen 🤲🏼 https://t.co/ld5VH2nj7f

— Mohammad Hafeez (@MHafeez22)

వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన జహీర్ అబ్బాస్, 1969లో న్యూజిలాండ్‌పై టెస్టు ఆరంగ్రేటం చేసి, 1985 వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు. తన కెరీర్‌లో 78 టెస్టులు ఆడిన జహీర్ అబ్బాస్, 44.79 సగటుతో 5062 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

తన కెరీర్‌లో 62 వన్డేలు ఆడిన జహీర్ అబ్బాస్, 47.62 సగటుతో 2572 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 457 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 108 సెంచరీలతో 34,843 పరుగులు చేసిన జహీర్ అబ్బాస్, పాకిస్తాన్ జట్టుకి 1981 నుంచి 1984 వరకూ కెప్టెన్‌గా వ్యవహరించాడు...

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత మ్యాచ్ రిఫరీగా, ఐసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన జహీర్ అబ్బాస్, భారతీయురాలైన రితా లూతరాని ప్రేమించి పెళ్లాడాడు. రితాకి ముందు నజీమా బొకరీ అనే మహిళను పెళ్లాడిన జహీర్ అబ్బాస్‌కి ముగ్గురు కూతుళ్లు  ఉన్నారు. కళ్లజోడుతో క్రీజులో దిగిన అతి కొద్ది మంది క్రికెటర్లలో జహీర్ అబ్బాస్ ఒకడు.. 

click me!