
కళ్లెదుట భారీ లక్ష్యం. ప్రత్యర్థి ఆశామాషీ జట్టేం కాదు.. విజయం సంగతి దేవుడెరుగు కానీ కళ్లముందు కనబడుతున్న కొండను కరిగించాలంటే.. జట్టును ఓటమి బారినుంచి తప్పించాలంటే నిలబడాలి. తడబడితే అంతే.. కాస్త సందిచ్చినా కంగారూలు విజయాన్ని లాగేసుకుంటారు. కానీ పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాత్రం అద్భుతమే చేసింది. నిలకడలేమీకి మారుపేరుగా ఉన్న ఆ జట్టు.. రోజున్నర సేపు పట్టుదలగా బ్యాటింగ్ చేసిందంటే అది అద్భుతమే కదా. భారీ లక్ష్యాన్ని చూసి వెరవకుండా పోరాడింది. విజయం సాధించకపోయినా అంతకుమించిన ఆత్మ స్థైర్యాన్ని పోగేసుకుంది. ఆ జట్టు తరఫున తక్కినవారంతా విఫలమవుతున్న చోట సారథి బాబర్ ఆజమ్ కళాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. రోజంతా నిలిచి పాక్ ను ఓటమిని దూరం చేసి.. ఆసీస్ కు అసహనాన్ని దగ్గర చేశాడు.
506 పరుగులు.. నాలుగో ఇన్నింగ్స్ లో పాక్ కు ఆసీస్ నిర్దేశించిన లక్ష్యమిది. కరాచీ టెస్టులో గెలవాలంటే పాక్ సాధించాల్సిన లక్ష్యాన్ని చూసి ఆ జట్టు అభిమానులైతే.. ‘ఎప్పుడెలా ఆడతారో తెలియని మా క్రికెటర్లతో అయితే కష్టమే.. ’అనుకుని ఉంటారు. విజయంపై ఎవరికీ ఆశలు లేకున్నా కనీసం ఓడకుంటే చాలు అనుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ కు శుభారంభమేమీ దక్కలేదు. ఆట నాలుగో రోజు (మంగళవారం) ఆట ముగిసే సమయానికి కొద్దిసేపటి ముందు బ్యాటింగ్ కు వచ్చిన పాక్.. ఆదిలోనే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (1), అజర్ అలీ (6) ల వికెట్లు కోల్పోయింది. ఈ ఇద్దరూ రావల్పిండి టెస్టులో సెంచరీలు సాధించిన వారే. 21 పరుగులకే రెండు వికెట్లు. నాలుగో రోజు ఆట ముగిసింది. పాక్ అభిమానుల కండ్లన్నీ సారథి బాబర్ ఆజమ్ మీదే..
వారి ఆశలను ఆజమ్ వమ్ము చేయలేదు. భీకరమైన పేస్ బలమున్న ఆసీస్ బౌలర్లు విసిరిన ప్రతి బంతిని గౌరవించాడు. ఎక్కడా దూకుడు లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు.. ‘గులాబి మొక్కకు అంటు కడుతున్నట్టు..’ అన్నట్టుగా సాగింది అతడి ఇన్నింగ్స్.. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 425 బంతులాడి 196 పరగులు చేశాడు. డబుల్ సెంచరీ కాస్తలో మిస్ అయినా పాకిస్థాన్ కు మాత్రం ఓటమిని తప్పించాడు. అతడి మారథాన్ ఇన్నింగ్స్ లో21 బౌండరీలు, 1 సిక్సర్ కూడా ఉంది.
ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే అబ్దుల్లా షఫీక్ (305 బంతుల్లో 96)తో కలిసి మూడో వికెట్ కు 228 పరుగులు జోడించాడు బాబర్. షఫీక్ నిష్క్రమించిన వెంటనే ఫవాద్ ఆలం (9) ను కూడా పెవిలియన్ కు పంపి పాక్ ను ఒత్తిడిలోకి నెట్టింది ఆసీస్. కానీ బాబర్ మాత్రం ఆసీస్ ఒత్తిళ్లకు లొంగలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (177 బంతుల్లో 104 నాటౌట్.. 11 ఫోర్లు, ఒక సిక్సర్) తో కలిసి ఆరో వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. డబుల్ సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో.. ఇంకా మ్యాచ్ 12 ఓవర్లలో ముగుస్తుందనగా నాథన్ లియాన్ వేసిన ఓవర్లో బంతికి స్లిప్స్ లో ఉన్న లబూషేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ పాక్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 392 పరుగులు.
బాబర్ నిష్క్రమణ వెంటనే ఆసీస్ పుంజుకుంది. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఫాహిమ్ అష్రఫ్ (0) తో పాటు సాజిద్ ఖాన్ (9) ను ఔట్ చేసి ఆసీస్ శిబిరంలో ఆశలు నింపాడు లియాన్. కానీ రిజ్వాన్ మాత్రం ఆసీస్ కు ఆ అవకాశమివ్వలేదు. తుదికంటా క్రీజులో నిలిచి పాక్ ను ఓటమి నుంచి తప్పించాడు. ఆసీస్ బౌలర్లలో లియాన్ కు 4 వికెట్లు దక్కగా.. సారథి పాట్ కమిన్స్ కు 2, కామెరాన్ గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది.
రావల్పిండిలో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరాచీలో కూడా అదే ఫలితం రిపీట్ అయింది. ఈ నేపథ్యంలో మార్చి 21 నుంచి 25 వరకు గడాఫీ స్టేడియం (లాహోర్) లో జరిగే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకం కానున్నది.
స్కోరు బోర్డు : ఆస్ట్రేలియా : తొలి ఇన్నింగ్స్ : 556/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ : 97/2 డిక్లేర్డ్
పాకిస్థాన్ : తొలి ఇన్నింగ్స్ : 148 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 443/7 డిక్లేర్డ్