
చడీచప్పుడు లేకుండా అనూహ్య నిర్ణయం ప్రకటించిన భారత మాజీ టెస్టు సారథి విరాట్ కోహ్లి ప్రకటనపై ఆయన అభిమానులు షాక్ లో ఉన్నారు. అభిమానులతో పాటు భారత క్రికెట్ కూడా ఈ సంచలన నిర్ణయంపట్ల ఏవిధంగా స్పందించాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ నేపథ్యంలో కోహ్లి నిర్ణయంపై అతడి కుటుంబసభ్యులు స్పందించారు. కోహ్లి సోదరి, సోదరుడు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లి సోదరి భావనా కోహ్లి దింగ్రా స్పందిస్తూ.. ‘ఈ గేమ్ (క్రికెట్) పట్ల నీకున్న అభిరుచి, నిజాయితీ, అంకితభావం మేము చిన్నప్పట్నుంచి చూస్తున్నాం. నువ్వు ఎన్నో మైలురాళ్లు అధిగమించి.. నిన్ను నువ్వు ఎప్పటికీ నిరూపించుకుంటూనే ఉంటున్నావు. ఈ నిర్ణయం తీసుకోవడంలో కూడా నీ బలాన్ని చూపావు. ఎప్పటికీ గర్వించే కుటుంబం..’ అంటూ రాసుకొచ్చింది.
శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన కోహ్లి.. ‘జట్టును సరైన దిశలో నడిపించడానికి ఏడేండ్లుగా కఠినంగా శ్రమించాను. టీమిండియా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూర్తి నిజాయితీతో నిర్వహించాను. భారత జట్టు కెప్టెన్‌గా ఒకానొక దశలో ఎన్నో అడ్డుగోడలను అధిగమించాను. ఇక సమయం వచ్చేసింది. నా ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో అపజయాలను చూశాను. అయితే ఎప్పుడూ ప్రయత్నాన్ని వదిలింది లేదు. ఇన్నేళ్ల పాటు నాకు తోడుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు. మీరంతా కలిసి నా ఈ ప్రయాణాన్ని అత్యంత సుందరంగా, మధురంగా మలిచారు..’ అని పోస్టు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే.
ఇక కోహ్లి ప్రకటనపై అతడి సోదరుడు వికాస్ కోహ్లి స్పందిస్తూ.. ‘ఇప్పుడే కాదు.. ఎల్లప్పటికీ ఛాంపియన్..’ అని ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చాడు. #ఛాంపియన్, #నమ్మకం, #అంకితభావం.. అనే పదాలకు హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు.
2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకన్న కోహ్లి.. భారత్ ను అన్ని ఫార్మాట్లలో విజయవంతంగా నడిపించాడు. 2014లో టెస్టు ర్యాంకులలో ఏడో స్థానంలో ఉన్న టీమిండియాను టెస్టులలో నెంబర్ వన్ ర్యాంకుకు తీసుకురావడంలో కోహ్లి పాత్ర ఎంతో ఉంది. మొత్తంగా 68 టెస్టులలో సారథిగా వ్యవహరించిన విరాట్.. ఏకంగా 40 విజయాలు సాధించాడు. 17 ఓటములు ఉన్నాయి.