Virat kohli: వంద శాతం జట్టుకోసమే పనిచేశావ్..: కోహ్లి రిటైర్మెంట్ నిర్ణయంపై దిగ్గజ ఆటగాళ్ల కామెంట్స్

Published : Jan 16, 2022, 11:23 AM IST
Virat kohli: వంద శాతం జట్టుకోసమే పనిచేశావ్..: కోహ్లి రిటైర్మెంట్ నిర్ణయంపై దిగ్గజ ఆటగాళ్ల కామెంట్స్

సారాంశం

Virat Kohli Quit Test Captaincy: భారత టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్టు అనూహ్య ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి  గురి చేశాడు విరాట్ కోహ్లి. అతడి నిర్ణయంపై ప్రముఖుల స్పందన...   

శనివారం అనూహ్య నిర్ణయం ప్రకటించిన భారత టెస్టు సారథి విరాట్ కోహ్లి పై దిగ్గజ క్రికెటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్ తో పాటు కోహ్లి సహచర ఆటగాడు రోహిత్ శర్మ కూడా దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విరాట్ తపన ఎప్పుడూ జట్టు గురించేనని  సచిన్ కొనియాడగా.. అది అతడి వ్యక్తిగత నిర్ణయమని గంగూలీ కామెంట్ చేశాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పకున్న కోహ్లి  నిర్ణయంపై ఎవరెలా కామెంట్స్ చేశారో ఇక్కడ చూద్దాం. 

ట్విట్ఱర్ వేదికగా స్పందించిన సచిన్ ఇలా రాసుకొచ్చాడు. ‘కెప్టెన్ గా  విజయవంతమైనందుకు అభినందనలు కోహ్లి..  జట్టు కోసం నువ్వు ఎల్లప్పుడూ వంద శాతం కష్టపడ్డావు. అది భవిష్యత్తులో కూడా కొనసాగిస్తావని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో నీకు మంచి జరుగాలని కోరుకుంటున్నాను..’ అని ట్వీట్ చేశాడు. 

 

సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘విరాట్ నాయకత్వంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అతడి నిర్ణయం వ్యక్తిగతమైనది. దానిని బీసీసీఐ గౌరవిస్తున్నది. అతడు జట్టులో కీలక సభ్యుడు. భవిష్యత్ లో జట్టును ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో తన వంతు పాత్ర పోషిస్తాడనే భావిస్తున్నా.. గొప్ప ఆటగాడు.. వెల్ డన్ కోహ్లి..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. 

 

ఇదిలాఉండగా కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై  ఆయన అభిమానులు బీసీసీఐ, సౌరవ్ గంగూలీనే నిందిస్తుండటం గమనార్హం. బీసీసీఐ, గంగూలీ, జై షా రాజకీయాల కారణంగానే  జట్టులో కోహ్లి శకం ముగిసిందని  వాళ్లు వాపోతున్నారు. నెల రోజుల క్రితం తలెత్తిన వన్డే కెప్టెన్సీ వివాదం ఇంకా సద్దుమణగకముందే  టెస్టు కెప్టెన్ గా కోహ్లి తప్పకుంటున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ నియమితుడైన విషయం తెలిసిందే. 

 

కాగా కోహ్లి నిర్ణయంపై రోహిత్ శర్మ కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. ‘షాకింగ్ గా ఉంది. కానీ విజయవంతమైన కెప్టెన్ గా భారత జట్టును నడిపించినందుకు అభినందనలు. రాబోయే కాలంలో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను కోహ్లి..’అని ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. 

శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన కోహ్లి.. ‘జట్టును సరైన దిశలో నడిపించడానికి ఏడేండ్లుగా కఠినంగా శ్రమించాను. టీమిండియా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూర్తి నిజాయితీతో నిర్వహించాను. భారత జట్టు కెప్టెన్‌గా ఒకానొక దశలో ఎన్నో అడ్డుగోడలను అధిగమించాను. ఇక సమయం వచ్చేసింది. నా ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో అపజయాలను చూశాను. అయితే ఎప్పుడూ ప్రయత్నాన్ని వదిలింది లేదు. పూర్తి నమ్మకంతో 100కి 120 శాతం శ్రమించాను. జట్టుకు  ఏది కరెక్ట్ కాదో, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నా దేశాన్ని నడిపించే బాధ్యత అందించిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఇన్నేళ్ల పాటు నాకు తోడుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు. మీరంతా కలిసి నా ఈ ప్రయాణాన్ని అత్యంత సుందరంగా, మధురంగా మలిచారు. రవి భాయ్ (రవిశాస్త్రి), సపోర్ట్ స్టాఫ్‌, టెస్టు క్రికెట్‌లో ఇంజన్‌లా ఉండి బండిని వెనక నుంచి నడిపించారు. చివరగా నన్ను నమ్మి కెప్టెన్‌గా నన్ను రిఫర్ చేసిన ఎమ్మెస్ ధోనీకి కృతజ్ఞతలు..’ అని పోస్టు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు