
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ - 2023 తుది అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ లో ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకొవిచ్.. గ్రీక్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపస్ ను ఢీకొనబోతున్నాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్లో జకొవిచ్.. 7-5, 6-1, 6-2 తేడాతో టామీ పాల్ ను ఓడించాడు. మరో సెమీస్ లో సిట్సిపస్.. 7-6 (2), 6-4, 6-7(6)., 6-3 తేడాతో రష్యాకు చెందిన కరెన్ ఖచనోవ్ ను ఓడించి ఫైనల్ కు అడుగుపెట్టాడు.
అన్ సీడెడ్ పాల్ పై జకొవిచ్ ఆది నుంచి ఆధిపత్యం చెలాయించాబడు. తొలి సెట్ ను 7-5తో ముగించిన జకొవిచ్.. ఆ తర్వాత పూర్తి ఎదురుదాడికి దిగాడు. తర్వాత వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు.
ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్ ను ఓడించి ఫైనల్ కు చేరడం ద్వారా జకొవిచ్.. గతంలో ఆండ్రీ అగస్సీ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. అగస్సీ.. ఈ టోర్నీలో వరుసగా 27 మ్యాచ్ లు గెలిచాడు. అంతేగాక జకోకు ఇది పదో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్. గతంలో 9 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ కు చేరిన జొకో.. 9 సార్లు టైటిల్ నెగ్గడం విశేషం.
ఇక గ్రీకు వీరుడు సిట్సిపస్ కు ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ కావడం గమనార్హం. ఆదివారం ఈ ఇద్దరి మధ్య ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గనక జకొవిచ్.. సిట్సిపస్ ను ఓడిస్తే అతడు రఫెల్ నాదల్ అత్యధిక గ్రాండ్ స్లామ్ రికార్డు (22) ను సమం చేస్తాడు.