భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్‌కు నో ప్రాబ్లమ్: లీగ్ కమిటీ

By Siva Kodati  |  First Published Mar 6, 2020, 3:41 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ యధావిథిగానే జరుగుతుందని, కరోనా ప్రభావం ఉండబోదని లీగ్ గవర్నింగ్ ఛైర్మన్ బ్రిజేష్ కుమార్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని బ్రిజేష్ చెప్పారు.


కరోనా ధాటికి ప్రజలతో పాటు ప్రపంచంలోని అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయా దేశాల్లోని ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సొమ్ము కరోనా కారణంగా ఆవిరైపోతోంది.

అది ఇది అని కాకుండా అన్ని రంగాలను కరోనా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది, చివరికి క్రీడా రంగం కూడా అల్లాడిపోతోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో జరగాల్సిన క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి.

Latest Videos

Also Read:ఐపిఎల్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్: సౌరవ్ గంగూలీ వివరణ ఇదీ....

అయితే భారత్‌లో అట్టహాసంగా జరిగే ఐపీఎల్ పైనా కరోనా ప్రభావం చూపిస్తుందని, ఈ ఏడాది సీజన్ వాయిదా పడుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది ఐపీఎల్ కమిటీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యధావిథిగానే జరుగుతుందని, కరోనా ప్రభావం ఉండబోదని లీగ్ గవర్నింగ్ ఛైర్మన్ బ్రిజేష్ కుమార్ స్పష్టం చేశారు.

కరోనా కారణంగా లీగ్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని బ్రిజేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

Also Read:ఐపిఎల్ ఫ్రాంచైజీలకు చేదు వార్త: ప్రైజ్ మనీలో సగానికి సగం కోత

బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఐపిఎల్ నిర్వహణపై స్పందించారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్, ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా వల్ల భారత్ లో ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ గురించి చర్చించలేదని చెప్పారు 

మూడు వన్జేల సిరీస్ ఆడడానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్ కు వస్తుందని బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా మార్చి 12వ తేదీన తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15వ తేదీన రెండో వన్డే, కోల్ కతాలోని ఈడెన్ గార్జెన్స్ వేదికగా మార్చి 18వ తేదీన మూడో వన్డే జరుగుతాయి.

click me!