ఐపీఎల్ నిర్వహణకు న్యూజీలాండ్ రెడీ, కానీ కాలమానం...?

By Sreeharsha GopaganiFirst Published Jul 8, 2020, 4:34 PM IST
Highlights

కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాల్లో క్రికెట్‌ మ్యాచుల నిర్వహణ సురక్షితం కాదని, కరోనా భయంతో అభిమానులు లేకుండా క్రికెట్‌ మ్యాచులు చప్పగా సాగుతాయని క్రికెట్‌ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అపూర్వ అభిమానుల నడుమ క్రికెట్‌ మ్యాచుల నిర్వహణకు న్యూజిలాండ్‌ సరైన వేదికని కొంతమంది అంటున్నారు. 

కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ప్రపంచం అతలాకుతలం అవుతోంది. లాక్‌డౌన్‌, షట్‌డౌన్‌లు సైతం కోవిడ్‌-19 విజృంభణకు అడ్డుకట్ట వేయటంలో విఫలయ్యాయి!. దీంతో కరోనా వైరస్‌ సహజీవనం చేసేందుకు ప్రపంచ దేశాలు మానసికంగా సిద్ధమవుతున్నాయి. 

కరోనా వ్యాప్తి తొలి దశలోనే నిర్మాణాత్మక అడుగులు వేసిన న్యూజిలాండ్‌.. కోవిడ్‌-19ను తరమికొట్టింది. లాక్‌డౌన్‌ను నిబద్ధతతో పాటించిన న్యూజిలాండ్‌, మెరుగైన వైద్య సేవలు, స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్‌ ప్రజలు మళ్లీ సాధారణ జీవనాన్ని ఆరంభించారు. 

కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాల్లో క్రికెట్‌ మ్యాచుల నిర్వహణ సురక్షితం కాదని, కరోనా భయంతో అభిమానులు లేకుండా క్రికెట్‌ మ్యాచులు చప్పగా సాగుతాయని క్రికెట్‌ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అపూర్వ అభిమానుల నడుమ క్రికెట్‌ మ్యాచుల నిర్వహణకు న్యూజిలాండ్‌ సరైన వేదికని కొంతమంది అంటున్నారు. 

2020 టీ20 వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియాలో కాకుండా న్యూజిలాండ్‌లో నిర్వహించటం తెలివైన నిర్ణయం అవుతుందని చెబుతున్నారు. ఇటువంటి వాతావరణంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊహించని ఆహ్వానం అందింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఆతిథ్యం ఇచ్చేందుకు న్యూజిలాండ్‌ ఆసక్తి వ్యక్తబరిచినట్టు సమాచారం.

మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌2020 నిరవధిక వాయిదా పడింది. అయినా, సెప్టెంబర్‌-నవంబర్‌ షెడ్యూల్‌లో ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే సెప్టెంబర్‌ 29న ఐపీఎల్‌13 అభిమానుల ముందుకు వచ్చేందుకు తాత్కాలిక షెడ్యూల్‌ సైతం రూపొందించారు. 

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల్లో బ్రెజిల్‌, అమెరికా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో భారత్‌లో కోవిడ్‌-19 కేసులు గరిష్ట స్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు, సర్వే నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 

ఈ పరిస్థితుల్లో భారత్‌ వేదికగా ఐపీఎల్‌ నిర్వహణ ఆచరణ సాధ్యంకాదు. దీంతో బీసీసీఐ వర్గాలు అధికారికంగానే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ మేరకు ఐపీఎల్‌ ఆతిథ్యానికి శ్రీలంక, యు.ఏ.ఈ ముందుకు రాగా తాజాగా న్యూజిలాండ్‌ సైతం సై అంటోంది. ' ఐపీఎల్‌2020 నిర్వహణకు బీసీసీఐ తొలి ప్రాధాన్యం భారత్‌. భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహణ సురక్షితం కాదు అనుకుంటే అప్పుడే విదేశీ అవకాశాలను పరిశీలిస్తాం. 

యు.ఏ.ఈ, శ్రీలంక తర్వాత న్యూజిలాండ్‌ సైతం ఐపీఎల్‌ నిర్వహణకు ముందుకొచ్చింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు, ప్రసారదారు, ఇతర భాగస్వాములతో సమావేశంలో దీనిపై చర్చించాల్సి ఉంది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత అత్యంత ప్రధానం. ఆ విషయంలో ఎటువంటి రాజీలేదు' అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009 ఐపీఎల్‌ దక్షిణాఫ్రికాలో నిర్వహించగా.. 2014 ఐపీఎల్‌ తొలి దశ మ్యాచులకు యుఏఈ ఆతిథ్యం ఇచ్చింది.

కోవిడ్‌-19 పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ ఐపీఎల్‌ నిర్వహణ బాగుంటుంది. కానీ భారత్‌, న్యూజిలాండ్‌ కాలమానాల మధ్య ఏడున్నర గంటల వ్యత్యాసం ఉంది. న్యూజిలాండ్‌లో మ్యాచులను 12.30 గంటలకు ఆరంభించినా.. భారత్‌లో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు మ్యాచ్‌ను అందుకోలేరు. 

మ్యాచ్‌ సమయంపై బీసీసీఐ రాజీపడితే న్యూజిలాండ్‌లో ఐపీఎల్‌ మెరుగైన అవకాశం కానుంది. హామిల్టన్‌, ఆక్లాండ్‌లకు రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చు. కానీ వెల్లింగ్టన్‌, క్రైస్ట్‌చర్చ్‌, నేపియర్‌లు విమాన ప్రయాణం అవసరం. 

ఈ అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విదేశీ కంపెనీల స్పాన్సర్‌షిప్‌లు, ఐపీఎల్‌ తాత్కాలిక షెడ్యూల్‌, విదేశాల్లో ఐపీఎల్‌ నిర్వహణ సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం కావాల్సి ఉంది. బీసీసీఐ నాయకత్వంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది.

click me!