4 నెలల తర్వాత గ్రౌండ్‌లోకి: నేటి నుంచి ఇంగ్లాండ్- విండీస్ టెస్ట్ సిరీస్, కొత్త రూల్స్ ఇవే..!!

By Siva KodatiFirst Published Jul 8, 2020, 2:34 PM IST
Highlights

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలను చవిచూసినట్లుగానే క్రీడలు సైతం సంక్షోభానికి గురైన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ మొదలవుతోంది

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలను చవిచూసినట్లుగానే క్రీడలు సైతం సంక్షోభానికి గురైన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ మొదలవుతోంది.

దీనిలో భాగంగా ఇంగ్లాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ ఇవాళ్టీ నుంచి మొదలవుతోంది. కోవిడ్ 19 ముప్పు పొంచి వుండటంతో ఈ సిరీస్‌ను బయోబబుల్ సృష్టించి నిర్వహిస్తున్నారు.

అలాగే ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి లేదు. అభిమానులు లేకుండా క్రికెట్ మ్యాచ్‌లు జరగడం 143 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రప్రథమం. మరోవైపు వైరస్ కారణంగా ఆటగాళ్లకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

కోవిడ్ బారినపడకుండా వారంతా సురక్షిత వాతావరణంలోనే ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ అలవాట్లో పొరపాటుగా రుద్దితే తొలి తప్పిదంగా అంపైర్లు వదిలేస్తారు.

రెండుకన్నా ఎక్కువసార్లు చేస్తే, జరిమానా కింద ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇస్తారు. ఇప్పటి వరకు క్రికెట్ మైదానాల్లో కూల్‌డ్రింక్స్, టీ, భోజనం చేసేందుకు వీరామాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే  కరోనా పుణ్యమా అని కొత్తగా శానిటేషన్ విరామాలు రానున్నాయి. ఆట మధ్యలో క్రికెటర్లంతా హ్యాండ్ శానిటైజర్లు రుద్దుకోవాల్సి వుంటుంది. అలాగే ఆటగాళ్లు ఉపయోగించే వస్తువులపై రసాయనాలు చల్లుతారని సమాచారం. రిజర్వ్ ఆటగాళ్లే బాల్‌బాయ్స్‌గా ఉంటారు. ప్రత్యక్ష ప్రసారాలు అందించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించే ఉంటారు. అంపైర్లుగా స్థానికులను తీసుకుంటారు. 

click me!