
అదేదో సినిమాలో ‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..’ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు క్రికెట్ లో కూడా ఆఖరు బంతికి సిక్సర్ కొడితే వచ్చే మజానే వేరు. అప్పటిదాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. ఎవరు గెలుస్తారా అని ప్రేక్షకులు, టీవీల ముందు అభిమానుల్లో ఒత్తిడి.. ఒక్కటంటే ఒక్క బంతితో తారుమారవుతాయి. అప్పటిదాకా గెలుస్తుందనకున్న జట్టు ఆ లాస్ట్ బాల్ కే ఓడొచ్చు.. ఓడుతుందనుకున్న జట్టు ఘన విజయం సాధించొచ్చు. నాడు.. షార్జాలో భారత్ పై పాకిస్థాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ సిక్సర్ నుంచి ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ దాకా లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టి గెలిపించడంలో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గదు. తాజాగా ఆ జాబితాలో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా చేరాడు.
ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ అయిన బౌల్ట్.. ఆఖరు బంతికి సిక్సర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. 108 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరు ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన బౌల్ట్.. లాస్ట్ బంతిని సిక్సర్ గా మలిచాడు.
న్యూజిలాండ్ లో సూపర్ స్మాష్ టీ20 టోర్నీ జరుగుతున్నది. ఈ క్రమంలో నిన్న రాత్రి కాంట్ బర్రీ కింగ్స్ తో నార్తన్ బ్రేవ్స్ తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాంట్ బెర్రీ.. 17.2 ఓవర్లలో 107 పరుగులే చేసి ఆలౌటైంది. ఇక 108 పరుగుల లక్ష్య ఛేదనలో నార్తన్ బ్రేవ్స్ ముందు బాగానే ఆడింది. 12.2 ఓవర్లకు ఆ జట్టు.. 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాలను కొనితెచ్చుకుంది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. నార్తన్ జట్టు 19వ ఓవర్లో 100 పరుగులు ఉండగా బౌల్ట్ బ్యాటింగ్ కు వచ్చాడు.
మూడో బంతికి సింగిల్ తీసిన బౌల్ట్.. నాలుగో బంతికి అవతలి ఎండ్ లో ఉన్న బ్యాటర్ కూడా సింగిల్ తీయడంతో చివరి రెండు బంతులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐదో బంతి బౌల్ట్ తలమీద నుంచి వెళ్లింది. పరుగులేమీ రాలేదు. ఒక బంతి.. ఆరు పరుగులు చేస్తే నార్తన్ విజయం.. అదే సమయంలో ఒక బంతి.. ఒక వికెట్ పడగొడితే కాంట్ బర్రీ గెలుపు.. అందరిలోనూ ఉత్కంఠ.. కానీ బౌల్ట్ మాత్రం బ్యాట్ కు అనుకూలంగా వచ్చిన బాల్ ను లాంగాఫ్ దిశగా గట్టిగా బాదాడు. అంతే బంతి గాల్లోకి లేచి ప్రేక్షకుల మధ్యలో పడింది. నార్తన్ బ్రేవ్ ఆటగాళ్లలో ఆనందం.. కాంట్ బర్రీ కి ఖేదం మిగిలింది.
ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంతితో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించే బౌల్ట్.. బ్యాట్ తో కూడా మెరవడంతో నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. రాబోయే ఐపీఎల్ లో కూడా ఇలాంటి ప్రదర్శనలు చేయాలని కోరుకుంటున్నారు.