
గత కొద్దికాలంగా ప్రపంచ క్రికెట్ లో ప్రభను కోల్పోయి వివాదాలతో నెట్టుకొస్తున్న పాకిస్థాన్ కు ఈ ఏడాది ఆశించినదానికంటే మంచే జరిగింది. ఈ ఏడాది న్యూజిలాండ్ జట్టు అర్థాంతరంగా సిరీస్ ను రద్దు చేసుకుని వెళ్లడం మినహా ఆ జట్టుకు అన్నీ విజయాలే. ఈ విజయాల్లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ల పాత్రే ఎక్కువ. ఈ యువ క్రికెటర్లిద్దరూ టీ20 క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నారు. రిజ్వాన్ సంగతి పక్కనబెడితే.. బాబర్ ఆటగాడిగానే కాకుండా సారథిగా కూడా మెరుస్తున్నాడు. అయితే అతడి నాయకత్వంపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు పాక్ కెప్టెన్ గా సక్సెస్ అవుతాడని తాను అస్సలు అనుకోలేదని వ్యాఖ్యానించాడు.
అఫ్రిది మాట్లాడుతూ... ‘బాబర్ ను పాకిస్థాన్ సారథిగా చేసినప్పుడు నేను భయపడ్డాను. ఎందుకంటే పాక్ కు కెప్టెన్ అంటే మాములు విషయం కాదు. ఆ ఆటగాడిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అతడు (కెప్టెన్) జట్టులోని ఆటగాళ్లను హ్యాండిల్ చేయాలి. మీడియాతో సఖ్యంగా మెలగాలి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), సెలెక్షన్ కమిటీ తో కూడా మంచి సంబంధాలుండాలి...
అయితే చిన్న వయసులోనే సారథి అయిన బాబర్ ఈ బాధ్యతలను మోయగలడా..? అని నాకు అనిపించేది. అతడు జట్టును సమర్థంగా నడిపిస్తాడని నేను నమ్మలేదు. కానీ బాబర్ మాత్రం తన ప్రదర్శనతో నన్ను తప్పు అని ప్రూవ్ చేశాడు...’ అని అన్నాడు. ఒత్తిడి అనేది అతడి బ్యాటింగ్ పై ప్రభావం చూపలేదని అఫ్రిది చెప్పాడు.
ఇదిలాఉండగా.. ఈ ఏడాది టెస్టులు, వన్డేల సంగతి అటుంచితే టీ20 లో మాత్రం పాకిస్థాన్ అత్యద్భుత ఫామ్ లో ఉంది. ఈ ఏడాది 29 టీ20 లు ఆడిన ఆ జట్టు.. ఏకంగా 20 మ్యాచులలో విజయం సాధించింది. ఈ విజయాలలో ఆజమ్ పాత్రే కీలకం. ఓపెనింగ్ బ్యాటర్ గా బరిలోకి దిగే అతడు.. ఈ ఏడాది ఏకంగా 1,779 పరుగులు చేశాడు. మరోవైపు వికెట్ కీపర్ రిజ్వాన్.. 2వేలకు పైగా రన్స్ చేయడం విశేషం. వీళ్లిద్దరి ఫామ్ తో పాక్ జట్టు ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
నా అల్లుడు మాట వినలేదు : అఫ్రిది
తనకు కాబోయే అల్లుడు షాహీన్ షా అఫ్రిది పై కూడా సీనియర్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు తన మాట వినలేదని చెప్పాడు. ఇప్పుడే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవద్దని తాను సూచించానని, కానీ అతడు మాత్రం వినలేదని అన్నాడు. ‘కెప్టెన్సీ తీసుకోవద్దని షాహీన్ కు చెప్పాను. దానికోసం మరో ఏడాదో లేదంటే రెండేండ్లో ఆగాలని సూచించాను. ముందు బౌలింగ్ మీద దృష్టి పెట్టమని కోరాను. కానీ అతడు నా మాట విన్లేదు..’ అని తెలిపాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా.. లాహోర్ కలండర్స్ తరఫున ఆడుతున్న షాహీన్ ను ఆ జట్టు ఇటీవలే సారథిగా ప్రకటించింది. సోహైల్ అక్తర్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. కాగా షాహీన్ షా అఫ్రిది.. షాహిద్ అఫ్రిది కూతురును పెండ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది.