శ్రీలంకలో న్యూజిలాండ్ పర్యటన... గురి మాత్రం టీమిండియాపైనే

By Arun Kumar PFirst Published Aug 14, 2019, 5:34 PM IST
Highlights

ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అవకాశాలను దెబ్బతీసిన న్యూజిలాండ్ మరోసారి కోహ్లీసేనను దెబ్బతీయాలని  చూస్తోంది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా  పరోక్షంగా ఆ పని చేయాలనుకుంటోంది.   

ఇంగ్లాండ్ వేదికన జరిగిన వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా జోరుకు న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టును సెమీస్ ఓడించి ఇంటిదారి పట్టించింది. ఇలా ఐసిసి మెగా టోర్నీలో కోహ్లీసేనను దెబ్బతీసిన కివీస్ మరోసారి అదే పని చేయాలనుకుంటోంది. టెస్ట్ ర్యాకింగ్స్ లో టాప్ లో కొనసాగుతున్న భారత జట్టును వెనక్కినెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం శ్రీలంక పర్యటనను ఉపయోగించుకోవాలని చూస్తోంది. 

ఐసిసి ఇటీవల ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్ లో భారత్ 113 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ కేవలం 4 పాయింట్లు వెనుకబడి 109 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే శ్రీలంక పర్యటనలో భాగంగా జరగనున్న రెండు టెస్టులను కివీస్ క్లీన్ స్వీప్ చేయగలితే భారత్ ను వెనక్కినెట్టి టాప్ కు చేరుకుంటుంది. అప్పుడు 115 పాయింట్లతో కివీస్ మొదటి స్ధానంలో నిలవగా 113 పాయింట్లతో భారత్ రెండో స్థానానికి పరిమితం కావాల్సివుంటుంది.  

శ్రీలంక-కివీస్ ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సీరిస్ ఇవాళ్టి(బుధవారం) నుండి ప్రారంభంకానుంది. ప్రస్తుతం పేలవ ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక జట్టును వారి స్వదేశంలో ఓడించడం పటిష్టమైన కివీస్ కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ ను మట్టికరిపించడం ద్వారా లంక జట్టు మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే శ్రీలంకతో టెస్ట్ సీరిస్ ను క్లీన్ చేయడం కివీస్ కు సాధ్యపడకపోవచ్చు. తద్వారా భారత్ ను వెనక్కినెట్టాలన్న కివీస్ ఆశలు గళ్లంతవుతాయి.

ఒకవేళ టెస్టుల్లో భారత అగ్రస్థానాన్ని కివీస్ కైవసం చేసుకున్నా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగలనుంది. వెస్టిండిస్ పర్యటనలో ఇప్పటికే టీ20 సీరిస్, వన్డే సీరిస్ లలో అదరగొట్టిన కోహ్లీసేన రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా ఆడనుంది. అందులోనూ భారత ఆటగాళ్లు జోరు కొనసాగిస్తే భారత్ మళ్లీ టాప్ కు చేరుకుంటుంది. ఇలా విలియమ్సన్ సేన టెస్టుల్లో టాప్ కు చేరినా దాన్ని ఎక్కువరోజులు నిలుపుకోవడం కష్టమైన పనే.    
 

click me!