భారత పర్యటన: దక్షిణాఫ్రికా జట్టులో ఇండియన్స్

By Arun Kumar PFirst Published Aug 14, 2019, 4:47 PM IST
Highlights

సెప్టెంబర్ నుండి  ప్రారంభంకానున్న భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు.  ఇలా భారత్ లో పర్యటించే జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.  

కొద్దిరోజుల క్రితమే  ముగిసిన ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో అయినా తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలని సౌతాఫ్రికా బోర్డు భావిస్తోంది. ఇందుకోసం భారత పర్యటనను యువ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించేందుకు ఉపయోగించుకుంటోంది. ఇలా పలువురు యువకులు భారత పర్యటన ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఆరంగేట్రం చేయడానికి సిద్దమయ్యారు. విచిత్రం ఏంటంటే భారత సంతతికి చెందిన కొందరు ఆటగాళ్లు ఈ పర్యటన ద్వారా ఆరంగేట్రం చేయనున్నారు. 

సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 22వ తేదీ వరకు దక్షిణాఫ్రికా జట్టు భారత్  లో పర్యటించనుంది. ఈ మధ్యకాలంలో మూడు టీ20, మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరిస్ లు జరగనున్నాయి. ఈ రెండు సీరిస్ ల కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. ఇందులో భారత సంతతికి  చెందిన కేశవ్ మహరాజ్, ముత్తస్వామిలకు చోటు దక్కింది.  

ఎవరీ కేశవ్ ఆత్మానంద్ మహరాజ్..?

సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న ఈ కేశవ్ ఆత్మానంద్ మహరాజ్ భారత సంతతికి  చెందినవాడు. అతడి ముత్తాతలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ కు చెందిన వారని  తెలుస్తోంది. అయితే వారు ఉపాధి నిమిత్తం 1874 సంవత్సరంలో సౌతాఫ్రికా కు వలసవెళ్లి కూలీలుగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయారు. 

అయితే కేశవ్ తండ్రి ఆత్మానంద్ మహరాజ్ మాత్రం తన తండ్రి, తాతల వృత్తికి భిన్నంగా  క్రికెట్ ను ఎంచుకున్నాడు. ఇలా అతడు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ గా  జట్టుకు సేవలందించాడు. 

తండ్రి  వారసత్వాన్ని కొనసాగిస్తూ కేశవ్ కూడా క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. స్పిన్ బౌలర్ గా సౌతాఫ్రికా ఏ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబర్చి అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇలా తమ పూర్వీకులు పుట్టిపెరిగిన భారత్ లో పర్యటించే అవకాశాన్ని పొందాడు. 

ఎవరీ ముత్తుస్వామి?

సెనురమ్  ముత్తుస్వామి... భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న మరో ఆటగాడు. ఇతడు కూడా భారత సంతతికి చెందిన ఆటగాడే కావడం విశేషం.  దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇతడి పూర్వీకులు సౌతాఫ్రికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడినట్లు సమాచారం.

అయితే  24ఏళ్ల ముత్తుస్వామి క్రికెటర్ గా  ఎదిగి ఏకంగా అంతర్జాతీయ జట్టులోనే చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా అతడు భారత పర్యటనకు ఎంపికయ్యాడు. తన స్పిన్ బౌలింగ్ తో అద్భుతాలు చేయడంతో పాటు ధనాధన్ బ్యాటింగ్ ద్వారా ప్రత్యర్థి బౌలర్లపై  విరుచుకుపడటం ఇతడి స్టైల్. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగి ఆటగాళ్లలో ముత్తుస్వామి టాప్ లో నిలిచాడు. 


సౌతాఫ్రికా టెస్ట్ టీం: 

ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), బవుమా, డిబ్రుయున్, డికాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్ మహరాజ్,మక్రమ్, ముత్తుస్వామి, ఎంగిడి, నాడ్జ్, ఫిలాండర్, డేన్ పిడ్ట్, కగిసో రబాడ, రుడి సెకండ్

సౌతాఫ్రికా టీ20 టీం:

డికాక్(కెప్టెన్), వాండర్ డుస్సెన్(వైస్  కెప్టెన్), బవుమా, జూనియర్ డాల, ఫార్ట్యూన్, హెండ్రిక్స్, రీజ హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, నాట్జ్, ఫెహ్లుక్వాయో, ప్రిటోరియస్, కగిసో రబాడా,  షంసీ, జోన్ జోన్ స్మట్స్ 

సంబంధిత వార్తలు

సంచలన నిర్ణయాలు... భారత పర్యటనకు సౌతాఫ్రికా టీం ఎంపిక
 

click me!