అప్పుడు మియాందాద్.. మధ్యలో అఫ్రిది.. ఇప్పుడు నసీమ్ షా.. ఆఖరి ఓవర్ సిక్సర్లతో భారత అభిమానులకు గుండెకోత

Published : Sep 08, 2022, 11:45 AM IST
అప్పుడు మియాందాద్.. మధ్యలో అఫ్రిది.. ఇప్పుడు నసీమ్ షా.. ఆఖరి ఓవర్ సిక్సర్లతో భారత అభిమానులకు గుండెకోత

సారాంశం

Asia Cup 2022: పాకిస్తాన్  దిగ్గజం జావేద్  మియాందాద్ నుంచి  నేటి నసీమ్ షా వరకు ఇదే కథ. ఆఖరి ఓవర్లలో సిక్సర్లతో మ్యాచ్ గమనాన్ని మార్చేయడంతో పాటు ఈ టోర్నీలో భారత్ కు ట్రోఫీలను దూరం చేస్తున్నారు పాక్ బ్యాటర్లు. 

ఆసియా కప్ లో భారత క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ బ్యాటర్లు గుండెకోతను మిగులుస్తున్నారు. ఆఖరి ఓవర్లో వాళ్లు బాదే సిక్సర్లతో టీమిండియా ఫ్యాన్స్  కు నిరాశ మిగులుతున్నది. నాటి మియాందాద్ నుంచి  నేటి నసీమ్ షా వరకు ఇదే కథ. ఆఖరి ఓవర్లలో సిక్సర్లతో మ్యాచ్ గమనాన్ని మార్చేయడంతో పాటు ఈ టోర్నీలో భారత్ కు ట్రోఫీలను దూరం చేస్తున్నారు. భారత అభిమానుల గుండె పగిలిన ఆ క్షణాలను ఓసారి చూస్తే.. 

36 ఏండ్ల (1986) క్రితం ముచ్చట.. ఇదే ఆసియా కప్. వేదిక  షార్జా.  ఆడుతున్నది ఇండియా-పాకిస్తాన్.  వన్డే ఫార్మాట్ లో జరిగిన ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్  నిర్ణీత  50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 246 పరుగుల లక్ష్యం. 

ఛేదనలో పాకిస్తాన్.. త్వరత్వరగానే వికెట్లను కోల్పోయింది. కానీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జావేద్ మియాందాద్ ఒక్కడే నిలబడ్డాడు.  అబ్దుల్ ఖాదిిర్, సలీం మాలిక్ లతో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ చేతన్ శర్మ వేశాడు. ఆ ఓవర్లో ఆఖరిబంతికి నాలుగు పరుగులు కావాలి. క్రీజులో జావేద్ మియాందాద్. చేతన్ శర్మ వేసిన లో ఫుల్ టాస్ బంతిని మియాందాద్ భారీ షాట్ ఆడాడు. బంతి  వెళ్లి స్టేడియంలో  మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల మధ్యలో పడింది. అంతే భారత క్రికెట్ అభిమానుల గుండె పగిలింది. 

 

సందర్భం 2..

మియాందాద్  చేసిన గాయం మరిచిపోవడానికి భారత్ కు చాలా కాలం పట్టింది. ఇక 2014లో పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూడా ఇలాంటి గాయమే చేశాడు. కానీ ఇది ఫైనల్ కాదు. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ (వన్డే ఫార్మాట్) లో భారత్.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్తాన్ తొలుత బాగానే ఆడింది. అహ్మద్ షెహజాద్ (42), మహ్మద్ హఫీజ్ (75) లు రాణంచారు. కానీ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. త్వరత్వరగా పాక్ వికెట్లు నేలకూల్చారు. కానీ షాహిద్ అఫ్రిది చివరివరకు  క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా చివరి ఓవర్లో పాక్ కు 11 పరుగులు అవసరమవగా అశ్విన్ వేసిన ఆ ఓవర్లో అఫ్రిది.. రెండు భారీ సిక్సర్లు బాదాడు. అంతే. ఈ టోర్నీలో ఫైనల్ చేరాలనే భారత్ ఆశలు నెరవేరలేదు. 

 

సందర్భం 3.. 

ఇక 2022కు వద్దాం. గ్రూప్ దశలో రెండు మ్యాచులు గెలిచి సూపర్-4కు చేరిన భారత్.. ఈ దశలో వరుసగా పాక్, శ్రీలంకతో మ్యాచ్ లు ఓడింది. అయితే బుధవారం అఫ్గాన్-పాక్ మధ్య మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడితే ఫైనల్ కు చేరడానికి భారత్ కు ఒక అవకాశం దొరికేది. కానీ ఈసారి టీమిండియా అభిమానుల వేదనకు  కారణమైంది నసీమ్ షా. ఈ 19 ఏండ్ల కుర్రాడు.. అఫ్గాన్ తో  మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో 11  పరుగులు అవసరముండగా  రెండు  సిక్సర్లు బాది పాక్ కు విజయం అందించాడు. ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ లో భారత్ ఆడకున్నా అఫ్గాన్ అభిమానుల కంటే ఎక్కువగా బాధపడింది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్సే అనడంలో అతిశయెక్తి లేదు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు