ఓటమి జీర్ణించుకోని అఫ్గాన్ ఫ్యాన్స్..స్టేడియంలో పాక్ అభిమానులపై దాడి.. చిలుక పలుకులు పలుకుతున్న అక్తర్

Published : Sep 08, 2022, 09:47 AM ISTUpdated : Sep 08, 2022, 09:50 AM IST
ఓటమి జీర్ణించుకోని అఫ్గాన్ ఫ్యాన్స్..స్టేడియంలో పాక్ అభిమానులపై దాడి.. చిలుక పలుకులు పలుకుతున్న అక్తర్

సారాంశం

Afghanistan vs Pakistan: చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ లో అఫ్గాన్ కు ఓటమి తప్పలేదు.  క్రికెట్ ప్రపంచం తీసుకున్నంత ఈజీగా ఈ ఓటమిని అఫ్గాన్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. 

క్రికెట్ లో గొప్ప పోరాటాలంటే భారత్-పాకిస్తాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా అని చెప్పుకుంటారు.  కానీ కొంతకాలంగా  ఈ జాబితాలో మరో కొన్ని దేశాలు వచ్చి చేరాయి.  ఆ జాబితాలో బంగ్లాదేశ్-శ్రీలంక ఒకటి కాగా అఫ్గాన్-పాకిస్తాన్  మ్యాచ్ లు కూడా ఈ మధ్య తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. దీంతో  ఈ మ్యాచ్ లకు సహజంగానే హైప్ వస్తున్నది. ఇక టీ20 క్రికెట్ విస్తృతి పెరిగాక గ్రౌండ్ లో ఆటగాళ్ల ప్రవర్తనతో పాటు పలు దేశాల క్రికెట్ అభిమానుల  ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతున్నది.  సరిహద్దులు కలిగి ఉండే దేశాల  మధ్య అయితే ఈ పోరు ఎక్కువగా ఉంది. అలా భూ సరిహద్దులు కలిగిన దేశాలు అఫ్గాన్-పాక్. ఈ రెండు జట్ల మధ్య బుధవారం షార్జాలో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ ఓటమిని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.  

అఫ్గాన్-పాక్ మ్యాచ్ ముగిశాక షార్జా క్రికెట్ స్టేడియంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు రచ్చ రచ్చ  చేశారు. షార్జా స్టేడియం స్టాండ్స్ లో  తమతో పాటు మ్యాచ్ చూసిన పాక్ అభిమానులపై దాడికి దిగారు.  స్టాండ్స్ లో ఉన్న కుర్చీలను తీసి వాళ్ల మీదకు విసిరారు. చైర్స్ ను చెల్లాచెదురుగా పడవేసి అక్కడ వీరంగం సృష్టించారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ పేసర్ షోయభ్ అక్తర్  తన ట్విటర్ ఖాతా వేదికగా పంచుకున్నాడు.  వీడియోను పోస్టు చేస్తూ అక్తర్.. ‘ఇదిగో ఇదీ షార్జాలో అఫ్గాన్  చేస్తున్న వీరంగం.. ఇలా చేయడం వారికి కొత్తకాదు. గతంలో కూడా పలుమార్లు వాళ్లు ఇలాగే చేశారు. ఇది క్రీడ. ఇక్కడ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి. షఫిక్ స్టానిక్జాయ్ (అఫ్గాన్ క్రికెట్  బోర్డు లో కీలక సభ్యుడు) మీరు క్రికెట్ లో ఎదగాలంటే ముందు మీ అభిమానులు, ఆటగాళ్లు ఆటకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోవాలి..’ అని రాసుకొచ్చాడు.  

 

అయితే అఫ్గాన్ ఫ్యాన్స్ తో పాటు వారి ఆటగాళ్లపై   చిందులు తొక్కుతున్న   అక్తర్.. ముందు తన జట్టు ప్రవర్తన గురించి కూడా ఆలోచించుకుంటే మంచిదని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ట్విటర్ లో  చిలుకపలుకులు పలుకుతున్న  అక్తర్.. అసిఫ్ అలీ వ్యవహారం, గతంలో అతడు క్రికెట్ ఆడేప్పుడు  భారత్ తో పాటు ఇతర దేశాలతో అక్తర్ వ్యవహరించిన తీరు.. ఆ జట్టు అభిమానుల ఆగడాలు అప్పుడే మరిచిపోయారా..? అని ప్రశ్నిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !