
9 నెలల సుదీర్ఘ వాదోపవాదాలు, చర్చోపచర్చల అనంతరం ఆగస్టు 31 నుంచి మొదలుకాబోతున్న ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తాకింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలక నేతల మధ్య తనవల్ల గొడవలు జరుగడం తనకు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నాడు.
పీసీబీకి ఆరు నెలల క్రితం వరకూ రమీజ్ రాజా అధ్యక్షుడిగా ఉండేవాడు. కానీ పాక్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోవడంతో కొత్తగా వచ్చిన ప్రధాని షెహబాజ్ షరీఫ్.. తనకు సన్నిహితుడైన నజమ్ సేథీని ఆ పదవిలో నియమించాడు.
వాస్తవానికి నజమ్ సేథీ ఉంటున్నది పీసీబీ తాత్కాలిక చైర్మెన్ గానే.. రమీజ్ రాజా దిగిపోయాక 120 రోజుల్లో పీసీబీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరునెలలు గడిచినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. జూన్ 21తో పీసీబీ తాత్కాలిక అధ్యక్ష పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, పీసీబీ భావిస్తున్నాయి. అయితే నజమ్ సేథీ తిరిగి పీసీబీ చీఫ్ గా ఎన్నికవుతారని అంతా అనుకున్నా అందుకు పాకిస్తాన్ ప్రభుత్వంలోని సంకీర్ణ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కీలక నేత అసిఫ్ జర్దారీ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
నజమ్ సేథీ విషయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో జర్దారీకి విభేదాలు కూడా తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేథీ స్వయంగా ఈ పదవిని వదులుకుంటున్నట్టు ప్రకటించాడు. జర్దారీ, షెహబాజ్ లు తన వల్ల గొడవ పడకూడదంటూ ట్విటర్ లో పేర్కొన్నాడు. పీసీబీకి అనిశ్చితి మంచిది కాదని.. తనంతట తానుగా రేసు నుంచి తప్పుకుంటున్నట్టు సేథీ ట్విటర్ లో తెలిపాడు. ఇక సేథీ రేసు నుంచి తప్పుకోవడంతో ఎవరు పీసీబీ చైర్మెన్ అవుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికైతే రేసులో జకా అష్రఫ్ రేసులో ముందున్నాడు.
ఇక నజమ్ సేథీ ఉన్నది తక్కువ కాలమే అయినా పాకిస్తాన్ క్రికెట్ లో ఆయన తీసుకున్న నిర్ణయాల వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ హెడ్‌కోచ్ గా మికీ ఆర్థర్ ను నియమించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆర్థర్.. తనకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే టీమ్ తో కలుస్తాడు. మిగతా సమయాల్లో అతడు ఆన్‌లైన్ ద్వారానే సేవలందిస్తాడు. ఈ నిర్ణయం క్రికెట్ కు అంతగా సూట్ కాదని.. పాకిస్తాన్ కు అయితే అస్సలే కాదని స్వయంగా ఆ జట్టు మాజీలే సేథీపై దుమ్మెత్తిపోశారు. ఇక ఆసియా కప్ విషయంలో కూడా సేథీకి సగం విజయం సగం ఓటమి అన్నట్టుగా క్రెడిట్ దక్కింది. ఎలాగైనా ఈ టోర్నీని పాక్ లో నిర్వహించేందుకు ఆయన సర్వశక్తులా కృషి చేశాడు. అయితే ఎట్టకేలకు ఆయన ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ (పాక్ లో నాలుగు మ్యాచ్ లు, శ్రీలంకలో 9) లోనే ఈ టోర్నీ జరుగనుంది.