
IPL 2021: ఐపీఎల్ రెండో దశ మొదలై రెండు మ్యాచ్ లు ఆడి రెండింటిలోనూ పరాజయాలు మూటగట్టుకున్న ముంబయి ఇండియన్స్ జట్టుకు మరో షాక్. తదుపరి మ్యాచ్ లకు ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. గతేడాది వెన్నునొప్పి సర్జరీ కారణంగా ఆటకు దూరమైన పాండ్యా.. ఇటీవలే శ్రీలంకకు వెళ్లిన జట్టుతో కలిసి ఆడినా పెద్దగా రాణించలేదు. ఇక ఐపీఎల్ రెండో దశ కోసం అతడు దుబాయ్ కు వెళ్లినా జట్టు యాజమాన్యం అతడిని ఆడించలేదు.
తాజాగా ఇదే విషయమై ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించాడు. బాండ్ మాట్లాడుతూ.. పాండ్యా ప్రస్తుతం బాగానే ఉన్నాడని, శిక్షణలోనూ పాల్గొంటున్నాడని చెప్పాడు. ముంబయి తరఫున ఆడేందుకు పాండ్యా సిద్ధంగా ఉన్నాడని, అయితే జట్టు అవసరాలతో పాటు త్వరలో జరుగబోయే పొట్టి ప్రపంచకప్ అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని అతడిని ఆడించేది లేదని తెలియజేస్తామని చెప్పాడు. మ్యాచ్ ల పైనే గాక ఆటగాళ్ల ఆరోగ్యం తమకు ముఖ్యమని అన్నాడు. తదుపరి మ్యాచ్ ఆడటానికి పాండ్యా సిద్ధంగా ఉన్నాడని కానీ దీనిపై జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని బాండ్ చెప్పుకొచ్చాడు.
ఇదిలాఉండగా నిన్న కలకత్తాతో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఓడిపోవడంతో డిఫెండింగ్ చాంపియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోగా.. కోల్కతా నైట్ రైడర్స్ (kolkata Knight Riders) జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది. తర్వాత జరిగే మ్యాచ్ లలో గెలిస్తేనే ముంబయికి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి.