
యూఏఈలో జరగనున్న ఐపీఎల్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా టెస్టులు చేయించుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
బుధవారం రాంచీలో ధోనీ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. మరో జట్టు సభ్యుడు మెనూ సింగ్‌తో కలిసి ధోనీ శాంపిల్స్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రానికి రిజల్ట్స్ రానున్నాయి. ఈ పరీక్షల్లో నెగిటివ్ వస్తే ధోని చెన్నై బయల్దేరి వెళ్లనున్నారు.
యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌లో పాల్గొనాలంటే నిబంధనల ప్రకారం 24 గంటల్లో రెండు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి వుంది. వాటిలో నెగిటివ్ వస్తేనే ఆగస్టు 20 తర్వాత దుబాయ్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది.
మరోవైపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై జట్టు క్యాంప్ నిర్వహించనున్నది. ఈ క్యాంప్‌కు జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ నేతృత్వం వహిస్తాడు.
ధోనీ, రైనా, పీయూష్ చావ్లాతో పాటు మరో 8 మంది తమిళనాడు క్రికెటర్లు యూఏఈ వెళ్లేందుకు సెలక్ట్ అయ్యారు. కాగా వ్యక్తిగత కారణాలతో రవీంద్ర జడేజా సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనడం లేదని సీఎస్కే వర్గాలు తెలిపాయి.