అందరూ మాహీలా ఉండరు! రనౌట్ అయిన ఇయాన్ బెల్‌ని తిరిగి పిలిపించి, ఆడించిన ధోనీ... వీడియో వైరల్..

By Chinthakindhi RamuFirst Published Jul 3, 2023, 1:51 PM IST
Highlights

2011లో నాటింగ్‌హమ్‌లో జరిగిన ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టులో ఇయాన్ బెల్ రనౌట్ అయినా... తిరిగి ఆడనిచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ! జానీ బెయిర్‌స్టో వివాదంతో పాత వీడియో వైరల్.. 

యాషెస్ సిరీస్ 2023 టోర్నీలో జానీ బెయిర్‌స్టో అవుట్ వివాదాస్పదమైంది. ఓవర్ ముగిసిందని భావించి, వికెట్ కీపర్ వైపు చూడకుండా జానీ బెయిర్‌స్టో ముందుకు వచ్చేయడం, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వికెట్లను గిరాటేసి అవుట్‌కి అప్పీల్ చేయడం జరిగిపోయాయి..

అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో కూడా గమనించని జానీ బెయిర్‌స్టో, ఆస్ట్రేలియా అప్పీలు చేస్తుండడంతో తెల్లమొహం వేశాడు. ఈ విషయంలో తప్పు ఎవరిదైనా ఉందంటే అది కచ్ఛితంగా జానీ బెయిర్‌స్టో. తన వికెట్ ఎంత ముఖ్యమో తెలిసి కూడా చాలా నిర్లక్ష్యంగా, లేజీగా వ్యవహరించాడు జానీ బెయిర్‌స్టో..

Latest Videos

అది పరుగు తీయాలనే ఉద్దేశంతో బెయిర్‌స్టో, క్రీజు దాటలేదని తెలిసి కూడా అవుట్‌కి అప్పీల్ చేయడం ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటున్నారు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్. దీంతో ఇంగ్లాండ్ చేసిన ఛీటింగ్‌లను, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన పాత విషయాలను తోడుతున్నారు ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్..

అయితే 2011లో జరిగిన ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. 2011లో నాటింగ్‌హమ్‌లో జరిగిన ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టులో ఇయాన్ బెల్ ఈ విధంగానే అవుట్ అయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ కొట్టిన షాట్‌ని బౌండరీ లైన్ దగ్గర ప్రవీణ్ కుమార్ డైవ్ చేస్తూ ఆపాడు. 

అయితే బంతి బౌండరీకి టచ్ అయిందని అనుకున్న ఇయాన్ మోర్గాన్, ఇయాన్ బెల్.. క్రీజు మధ్యలో మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఈలోపు ప్రవీణ్ కుమార్ లేచి బౌండరీ లైన్‌కి అర ఇంచు ముందు ఆగిపోయిన బంతిని తీసుకుని, మహేంద్ర సింగ్ ధోనీకి త్రో వేయడం, అతను వికెట్లను పడగొట్టి అప్పీలు చేయడం జరిగిపోయాయి.

Jonny Bairstow Runout reminds me of "When MS Dhoni called back Ian Bell after Run out even though he was out"

(Full Story in Thread) pic.twitter.com/TQuHne7HD4

— 🏆×3 (@thegoat_msd_)

అప్పటికే ఇయాన్ బెల్ 144 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అదీకాకుండా ఇంగ్లాండ్, టీమిండియాపై 220 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ చేరేందుకు సిద్ధమయ్యాడు ఇయాన్ బెల్. ఈ బంతి తర్వాత టీ బ్రేక్ రావడంతో అందరూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు. టీ బ్రేక్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ తన అప్పీల్‌ని వెనక్కి తీసుకుని, ఇయాన్ బెల్‌ని తిరిగి పిలిపించి ఆడించాడు. 

ఈ సంఘటనతో ఐసీసీ క్రికెట్ స్పిరిట్ ఆఫ్ ది డికేట్ అవార్డును దక్కించుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. క్రీడాస్ఫూర్తితో క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నా, ఈ మ్యాచ్‌లో టీమిండియా 319 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇయాన్ బెల్ 159 పరుగులు చేసి యువరాజ్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా కెవిన్ పీటర్సన్ 63, ఇయాన్ మోర్గాన్ 70, మ్యాట్ ప్రియర్ 73, టిమ్ బ్రేస్నన్ 90, స్టువర్ట్ బ్రాడ్ 44 పరుగులు చేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 544 పరుగుల భారీ స్కోరు చేసింది..

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ని 221 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, 288 పరుగులు చేసి 67 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో సీన్ పూర్తిగా మారిపోయింది. 611 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

సచిన్ టెండూల్కర్ 56 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా హర్భజన్ సింగ్ 46, ప్రవీణ్ కుమార్ 25 పరుగులు చేశారు. అభినవ్ ముకుంద్ 3, రాహుల్ ద్రావిడ్ 6, వీవీఎస్ లక్ష్మణ్ 4, సురేష్ రైనా 1, యువరాజ్ సింగ్ 8 పరుగులు చేయగా మహేంద్ర సింగ్ ధోనీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.. 

click me!