కోట్లు తెచ్చే వ్యాపారాలు ఉన్నా, వ్యవసాయం చేయడానికి కారణం ఇదే... - మహేంద్ర సింగ్ ధోనీ

By Chinthakindhi RamuFirst Published Aug 19, 2023, 2:00 PM IST
Highlights

కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో దొరికిన సమయాన్ని వ్యవసాయం కోసం వాడాలనుకున్నా... మొత్తం 40 ఎకరాల్లో పంటలు పండిస్తున్నాం... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్స్.. 

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ మూడేళ్లు కావస్తున్నా మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ డజనుకి పైగా బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ధోనీ, వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. అయితే సమయం దొరికినప్పుడల్లా ధోనీ, ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నడం, వ్యవసాయం చేయడం చేస్తుండడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతూ ఉంటారు...

రాంఛీలో ధోనీ ఫామ్‌ హౌజ్‌లో పండించే పంటలు, ఇండియాలో కాదు, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కూడా అమ్ముడవుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తులతో పాటు కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం కూడా మొదలెట్టి సక్సెస్ సాధించాడు మహేంద్ర సింగ్ ధోనీ. స్టాబెర్రీ, కాలిఫ్లవర్ వంటి పంటలను పండించిన ధోనీ, అప్పుడప్పుడూ పొలంలో తిరుగుతూ పనిచేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు..

Latest Videos

ధోనీ తలుచుకుంటూ కోట్ల రూపాయలు పెట్టి, ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించగలడు. అలాగే స్పోర్ట్స్ బ్రాండ్‌తో మార్కెట్‌లోకి వచ్చినా తనకున్న క్రేజ్‌కి, తరాల పాటు కూర్చొని తినగలిగేంత లాభాలు సంపాదించగలడు. అయితే వ్యవసాయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? 

‘నేను ఓ చిన్న పట్టణంలో పుట్టాను. రాంఛీలో నా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చూస్తూ పెరిగాను. ఎప్పటి నుంచో నాకు మొక్కలు, చెట్లు అంటే ఎంతో ఇష్టం. రాత్రికి రాత్రి పండ్లు అలా ఎలా పెరుగుతాయి? పూలు ఎలా విచ్చుకుంటాయనేది నిద్రపోకుండా చూడాలని అనిపించేది... 

కోవిడ్ బ్రేక్‌తో నాకు కావాల్సినంత సమయం దొరికింది. అప్పటికే మాకు రాంఛీలో 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 4-5 ఎకరాల్లో మాత్రమే వ్యవసాయం చేసేవాళ్లు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో దొరికిన సమయాన్ని వ్యవసాయం కోసం వాడాలనుకున్నా. వ్యవసాయంలోకి దిగి, మెల్లిమెల్లిగా ఇప్పుడు మొత్తం 40 ఎకరాల్లో పంటలు పండిస్తున్నాం...’ అంటూ ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఏటా రూ.12 కోట్లు అందుకుంటున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థల్లో మాహీకి వాటాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ ఫిల్మ్ ప్రొడక్షన్‌ని కూడా మొదలెట్టాడు ధోనీ..

ఈ బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించబోతున్నట్టు ధోనీ భార్య సాక్షి సింగ్ ప్రకటించింది...

ఓరియో, డ్రీమ్11, మాస్టర్ కార్డ్, వింజో, టీవీఎస్ వంటి డజనుకు పైగా బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా... విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక సంపాదన కలిగిన రెండో భారత క్రికెటర్‌గా ఉన్నాడు ధోనీ. 

click me!