Sri Lanka vs Afghanistan test : మైదానంలోకి ఉడుము, బౌండరీ లైన్ వద్ద చక్కర్లు , కాసేపు నిలిచిన మ్యాచ్ (వీడియో)

By Siva Kodati  |  First Published Feb 3, 2024, 8:14 PM IST

శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఉడుము అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో ఒక ఉడుము బౌండరీ లైన్ దాటి మైదానంలోకి వచ్చింది. ఎటువైపు వెళ్లాలో తెలియక అటు ఇటూ తిరిగింది. దీంతో అప్రమత్తమైన అంపైర్లు మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. 


అప్పుడప్పుడు వాతావరణం అనుకూలించక క్రికెట్ మ్యాచ్‌లకు అంతరాయం కలుగుతూ వుంటుంది. మరికొన్ని సార్లు మానవ తప్పిదాల కారణంగా మ్యాచ్‌లు నిలిచిపోతాయి. అయితే ఇటీవలి కాలంలో గ్రౌండ్‌లోకి జంతువులు వస్తూ వుండటంతో మ్యాచ్‌లు ఆగిపోతున్నాయి. కొన్ని సార్లు పాములు కూడా ఎంట్రీ ఇచ్చి క్రికెటర్లను పరుగులు పెట్టిస్తూ వుంటాయి . తాజాగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఉడుము అంతరాయం కలిగించింది. ఒక టెస్ట్, మూడు వన్డేలు , మూడు టీ20లలో పాల్గొనేందుకు ఇటీవల ఆఫ్ఘన్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. 

ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో భాగంగా ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి కొలంబోలో ప్రారంభమైంది. రెండో రోజు ఆట జరుగుతూ వుండగా లంక ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో ఒక ఉడుము బౌండరీ లైన్ దాటి మైదానంలోకి వచ్చింది. ఎటువైపు వెళ్లాలో తెలియక అటు ఇటూ తిరిగింది. దీంతో అప్రమత్తమైన అంపైర్లు మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన మైదాన సిబ్బంది ఉడుమును గ్రౌండ్ అవతలకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Latest Videos

undefined

 

Earlier snakes and now a monitor lizard.

- Sri Lanka is the home of uninvited guests on the field. 🥶pic.twitter.com/3uG8Hfs2L6

— Mufaddal Vohra (@mufaddal_vohra)

 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా 91 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు, సహచరులు సహకరించకున్నప్పటికీ పట్టుదలతో ఆడాడు. కానీ త్రుటిలో సంచరీని చేజార్చుకున్నాడు. నూర్ అలీ జద్రాన్ (31), అలిఖిల్ (21), కైస్ అహ్మద్ 21 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లో విశ్వ ఫెర్నాండో 4, అశిత ఫెర్నాండో, ప్రభత్ జయసూర్య చెరో మూడు వికెట్లు తీశారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ప్రస్తుతం భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంకేయులు 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేశారు.  ఏంజెలో మాథ్యూస్ (141) , దినేశ్ చండిమల్ (107), మధుష్క (37), కరుణరత్నే (77) రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ , కైస్ అహ్మద్‌లు తలో రెండు వికెట్లు , నిజాత్ ఒక వికెట్ పడగొట్టారు. 
 

click me!