
టీమిండియా మాజీ క్రికెటర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘శభాష్ మిథు’. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. స్వయంగా మిథాలీ రాజ్.. తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ ట్రైలర్ ను అభిమానులతో పంచుకుంది. చిన్నతనం నుంచే క్రికెటర్ కావాలని కలలు కన్న మిథాలీ.. ఆ క్రమంలో ఆమె ఎదుర్కున్న అవమానాలు.. ఆటలో ఎత్తు పల్లాలు.. ఇతరత్రా ఆమె కెరీర్ కు సంబంధించిన విషయాలతో ట్రైలర్ ను ఆసక్తికరంగా మలిచారు దర్శక నిర్మాతలు.
చిన్నప్పట్నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న మిథాలీ.. భారత మహిళా క్రికెట్ లో చేరడం.. ఉమెన్ క్రికెట్ కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు.. ఇలాంటి ప్రతి విసయాన్నీ సినిమాలో చూపించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది.
మిథాలీ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తూ.. ‘ఒక ఆట.. ఒక దేశం.. ఒక ఆశయం.. నా కల! ఈ బృందానికి కృతజ్ఞతలు, నా కథను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది..’ అని ఇన్స్టాలో రాసుకొచ్చింది.
ట్రైలర్ లో మిథాలీ.. ‘మెన్ ఇన్ బ్లూ తరహా మనకు కూడా ఓ టీమ్ ఉంటే బాగుంటుంది.. ఉమెన్ ఇన్ బ్లూ..’ అని తాప్సీ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మిథాలీ చిన్నతనంలో ఎదుర్కున్న అనుభవాలు, భారత క్రికెట్ లోకి వచ్చాక ఆమె చూపిన తెగువ.. వంటివి ప్రేక్షకులను హత్తుకునేలా రూపొందించారు. ఇక మిథాలీగా తాప్సీ అదరగొట్టింది. వయాకామ్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఇటీవలే అంతర్జాతీయ కెరీర్ నుంచి ఇటీవలే రిటైరైన మిథాలీ.. భారత జట్టు తరఫున 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు ఆడింది. టెస్టులలో 699, వన్డేలలో 7,805, టీ20లలో 2,364 పరుగులు సాధించింది. తన అంతర్జాతీయ కెరీర్ లో మిథాలీ 8 సెంచరీలు 85 హాఫ్ సెంచరీలు చేసింది.