
గడిచిన మూడు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజలకు రెండు పూటలా తిండి దొరకడం కూడా గగనమైంది. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరల కారణంగా ప్రజలు పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఏం కొనాలన్నా ధరలు కొండెక్కడంతో ప్రజలు వాటిని కొనడం మానేసి నీళ్లు తాగి రోజులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ క్రికెటర్, ఆ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యుడు రోషన్ మహానమ ప్రజల కష్టాలకు చలించిపోయాడు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిల్చున్న ప్రజలకు టీ, బన్ ఇస్తూ వాళ్ల ఆకలిని తీర్చుతున్నాడు.
పెట్రోల్ బంక్ ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఉండటంతో చాలా మంది ప్రజలు రోజుల తరబడి అక్కడే పెట్రోల్, డీజిల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో చాలామందికి ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానమ రంగంలోకి దిగాడు.
కొలంబో లోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి క్యూలో నిల్చున్న ప్రజలకు టీ, బన్ ను సప్లై చేశాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ లో షేర్ చేశాడు. తాను చేసేది చాలా తక్కువని.. కమ్యూనిటీ మీల్ షేర్ ద్వారా ఉన్నవాళ్లంతా తమ తోటివారికి సాయం చేయాలని ట్విటర్ వేదికగా అభ్యర్థించాడు. ఈ కష్టసమయాల్లో ఒకరికి ఒకరు సాయంగా నిలవాలని కోరాడు. రోషన్ తో పాటు కొద్దిరోజులుగా పలువురు శ్రీలంక మాజీ క్రికెటర్లు తమకు తోచినవంతుగా ప్రజలకు సాయమందిస్తున్నారు అర్జున రణతుంగ, సనత్ జయసూర్య, కుమార సంగక్కర లు తమ వంతుగా లంక ప్రజల ఆకలిని తీర్చుతున్నారు.
1986 నుంచి 1999 వరకు లంక తరఫున ఆడిన రోషన్.. 52 టెస్టులు, 213 వన్డేలు ఆడాడు. టెస్టులలో 2,576 పరుగులు, వన్డేలలో 5,162 రన్స్ చేశాడు. 1996 లో శ్రీలంక వన్డే ప్రపంచకప్ నెగ్గడంలో రోషన్ కీలక పాత్ర పోషించాడు.