అతను కెప్టెన్ గా పనికి రాడు: మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Mar 3, 2020, 12:31 PM IST
Highlights

స్టీవ్ స్మిత్ పై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా పనికి రాడని ఆయన అభిప్రాయపడ్డాడు. పాట్ కమిన్స్ ను కెప్టెన్ గా నియమిస్తే మంచిదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

మెల్బోర్న్: జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ పనికి రాడని, ఆయన సరైనవాడు కాడని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పేసర్ పాట్ కమిన్స్ ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా నియమిస్తే మంచిదని ఆయన అన్నారు. ఇటీవల మీడియా సమావేశంలో మైకేల్ క్లార్క్ ఆ వ్యాఖ్యలు చేశారు. స్టీవ్ స్మిత్ ను మళ్లీ కెప్టెన్ గా నియమించాలంటారా అనే మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆయన స్పందించాడు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టుకు ఇంత మంది కెప్టెన్లు అవసరం లేదని, ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కెప్టెన్ ఉండడం కన్నా అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండడం మంచిదని ఆయన అన్నాడు. టీ20 ప్రపంచ కప్ పోటీల తర్వాత కమిన్స్ ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా నియమిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డాడు.

కమిన్స్ ఆటను బాగా అర్థం చేసుకుంటాడని, అతను ఓపెనింగ్ బౌలర్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ కూడా చేయగలడని, మైదానంలో చురుగ్గా కదులుతాడని ఆయన అన్నాడు. ప్రస్తుత స్థితిలో ఆస్ట్రేలియాకు మంచి కెప్టెన్ అవసరమని, స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్ మన్ అనే విషయాన్ని తాను అంగీకరిస్తానని, కానీ కెప్టెన్సీ చేయడానికి మాత్రం సరైన ఆటగాడు కాడని ఆయన అన్నారు. 

టిమ్ పైన్ ఇప్పటికే కెప్టెన్ గా రాణించాడని, ఇందులో సందేహం లేదని, క్రికెట్ క్రీడనుంచి తప్పుకునే వరకు కెప్టెన్ గా కొనసాగే అర్హత పైన్ కు ఉందని, టీమ్ కు ఇప్పుడు 34 ఏళ్ల వయస్సు అని, ఈ వేసవి తర్వాత వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని ఆయన అన్నాడు. స్వదేశీ గడ్డపై ఆస్ట్రేలియా గెలిస్తే అది టిమ్ పైన్ కు వీడ్కోలు పలకడానికి తగిన సమయమని ఆయన అన్నాడు. 

బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో స్మిత్ తన కెప్టెన్సీ కోల్పోయాడు. దాంతో పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్ట్ లకు టీమ్ పైన్ కెప్టెన్ లుగా ఉన్నారు. స్మిత్ తిరిగి ఆటలోకి ఆడుగు పెట్టి ఏడాది అవుతోంది. ఈ స్థితిలో స్టీవ్ స్మిత్ కు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలని పలువురు ఆసీస్ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ ఆ అభిప్రాయం వెల్లడించారు.

click me!