LSG vs MI : లక్నోతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ, నమన్ ధీర్ లు సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగినా ముంబై ఇండియన్స్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో ఈ సీజన్ లో 10వ ఓటమితో తన చివరి మ్యాచ్ ను ముగించింది.
Mumbai Indians vs Lucknow Supergiants : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 76వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. తన హోం గ్రౌండ్ లో కూడా హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రోహిత్ శర్మ, నమన్ ధీర్ లు సూపర్ హాఫ్ సెంచరీలు సాధించినా.. మిగతా ప్లేయర్లు రాణించలేకపోవడంతో ముంబై ఇండియన్స్ లక్నో చేతిలో ఓటమిపాలైంది. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై.. ఐపీఎల్ 2024 లో తన చివరి మ్యాచ్ ఓటమితో ముగించి, ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్..
ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నోకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. దేవదత్ పడిక్కల్ డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే, తర్వాత వచ్చిన స్టోయినిస్ తో కలిసి కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. 55 పరుగులు తన ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. స్టోయినిస్ 28 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసం చూపించాడు. వస్తువస్తూనే ఫోర్లు, సిక్సర్లతో ముంబై పై విరుచుకుపడ్డాడు. పూరన్ ధనాధన్ బ్యాటింగ్ తో లక్నో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
నికోలస్ పూరన్ మరోసారి మెరుపులు మెరిపించడంతో లక్నో టీమ్ భారీ స్కోర్ సాధించింది. పూరన్ కేవలం 29 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 75 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరల్ ఆయుష్ బదోని 22, కృనాల్ పాండ్యా 12 పరుగులు చేయడంతో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
ముంబై ఆరంభం అదిరింది కానీ.. రోహిత్ ఔట్ కావడంతో..
215 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు మంచి ఆరంభం లభించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్ లు పవర్ ప్లే లో మంచి స్కోర్ అందించారు. రోహిత్ శర్మ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 23 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత అప్పటివరకు ముంబై వైపు ఉన్న మ్యాచ్ లక్నో చేతిలోకి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నేహాల్ వధేరా లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. అయితే, చివరలో నమన్ ధీర్ సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు కానీ, ముంబై కి విజయాన్ని అందించలేకపోయాడు. నమన్ ధీర్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. నమన్ ధీర్ 62 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేఎల్ రాహుల్ టీమ్ లక్నో 18 పరుగులు తేడాతో ముంబై పై విజయాన్ని అందుకుంది.
టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ ఏం చెప్పిందంటే..?