
వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆస్ట్రేలియా, ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ఆసీస్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. వన్డేల్లో వరుసగా 18వ మ్యాచ్‌లో విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించి... 16 ఏళ్ల కిందటి టీమిండియా రికార్డును చెరిపేసింది ఆస్ట్రేలియా...
టాస్ గెలిచి, సౌతాఫ్రికాకి బ్యాటింగ్ అప్పగించింది ఆస్ట్రేలియా. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళా జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు సఫారీ జట్టుకి శుభారంభం అందించారు. లీజెల్లీ లీ 44 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేసి, తొలి వికెట్‌కి 88 పరుగులు జోడించిన తర్వాత అవుటైంది...
లారా గుడ్ఆల్ 15 పరుగులు చేసి అవుటైనా లౌరా వాల్వర్ట్ 134 బంతుల్లో 6 ఫోర్లతో 90 పరుగులు చేయగా కెప్టెన్ సునే లూజ్ 51 బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు చేసింది. డు ప్రీజ్ 14 పరుగులు చేయగా మరిజాన్నే క్యాప్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు, సీ ట్రేన్ 9 బంతుల్లో ఓ సిక్స్‌తో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...
ఆలీసా హేలీ 5 పరుగులు, రచెల్ హేన్స్ 17 పరుగులు చేసి అవుట్ కావడంతో 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే బేత్ మూనీతో కలిసి మూడో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించిన కెప్టెన్ మెగ్ లానింగ్, ఆ తర్వాత తహిలా మెక్‌గ్రాత్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 93 పరుగులు, అస్‌లీ గార్గ్‌నర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 43 పరుగులు జోడించింది...
బేత్ మూనీ 23 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి రనౌట్ కాగా తహిలా మెక్‌గ్రాత్ 35 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసింది. అస్‌లీ గార్గ్‌నర్ 26 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ కాగా అన్నా బెల్ సుథర్‌లాండ్ 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచింది...
130 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కెప్టెన్ మెగ్ లానింగ్, వన్డే వుమెన్స్ వరల్డ్ కప్‌లో మూడో సెంచరీ నమోదు చేసింది. ఓవరాల్‌లో ఛేదనలో మెగ్ లానింగ్‌కి ఇది 53 ఇన్నింగ్స్‌ల్లో 10వ సెంచరీ...
272 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, 45.2 ఓవర్లలో ఛేదించింది ఆస్ట్రేలియా. సౌతాఫ్రికా మహిళా జట్టుపై 250+ లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా ఇదే తొలిసారి. ఫీల్డింగ్‌లో 7 క్యాచులను డ్రాప్ చేసిన సౌతాఫ్రికా మహిళా జట్టు, మిస్ ఫీల్డ్స్‌తో ప్రత్యర్థికి ఈజీగా పరుగులు ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకుంది. తొలి నాలుగు మ్యాచుల్లో గెలిచిన సౌతాఫ్రికా మహిళా జట్టుకి ఇది వుమెన్స్ వరల్డ్ కప్‌లో తొలి ఓటమి... ఆరుకి ఆరు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా, టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి వెళ్లనుంది...
వరుసగా 18 వన్డేల్లో ఛేదనలో విజయాలను అందుకున్న ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు, 2005-06లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో భారత పురుషుల జట్టు క్రియేట్ చేసిన 17 వరుస విజయాల రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది...