
ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ భారత జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం వెంటాడింది. మంచి ఓపెనింగ్ దక్కినా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది టీమిండియా...
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కి 74 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 51 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన స్మృతి మంధాన, నహీదా అక్తర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యింది. మూడు ఫార్మాట్లలో కలిసి 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంది స్మృతి మంధాన...
ఆ తర్వాతి ఓవర్‌లోనే 42 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ, రితూ మోనీ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యింది. షెఫాలీ వర్మ అవుటైన తర్వాతి బంతికే కెప్టెన్ మిథాలీ రాజ్... గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరింది.
రితూ మోనీ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించిన మిథాలీ రాజ్, ఫాతిమా ఖటున్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 2017 వన్డే వల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన మిథాలీకి ఇదో రెండో గోల్డెన్ డక్. వన్డే వరల్డ్ కప్‌లో గోల్డెన్ డకౌట్ అయిన తొలి భారత కెప్టెన్‌గా, అత్యధిక సార్లు గోల్డెన్ డక్ అయిన కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకుంది మిథాలీ రాజ్...
74 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాకి హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ రూపంలో మరో షాక్ తగిలింది. 33 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్, జట్టు స్కోరు 108 పరుగులున్నప్పుడు రనౌట్ అయ్యింది. ఈ దశలో రిచా ఘోష్, యస్తికా భాటియా కలిసి ఐదో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
36 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన రిచా ఘోష్‌ను నహీదా అక్తర్ అవుట్ చేయగా 80 బంతుల్లో 2 ఫోర్లతో 50 పరుగులు చేసిన యస్తికా భాటియా... రితూ మోనీ బౌలింగ్‌లో అవుటైంది. పూజా వస్త్రాకర్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా స్నేహ్ రానా 23 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యింది.
బంగ్లాదేశ్ బౌలర్ రితూ మోనీ 10 ఓవర్లలో 2 మెయిడిన్లతో 37 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా నహీదా అక్తర్‌కి రెండు వికెట్లు దక్కాయి. ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకుని, మూడు మ్యాచుల్లో ఓడిన టీమిండియా ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌తో పాటు సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది.
సౌతాఫ్రికాతో జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో కెప్టెన్ మెగ్ లానింగ్ 130 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియాకి వరుసగా ఆరో విజయాన్ని అందించింది.