
కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన క్రికెట్ 117 రోజుల విరామం అనంతరం అభిమానుల కోలాహలం లేకుండానే బయో సెచురె బబుల్ వాతావరణంలో ప్రారంభమయింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్ కరోనా తరువాత క్రికెట్ కి నాంది పలికింది.
సౌతాంప్టన్‌లో విండీస్ ఎంత చిరస్మరణీయ విజయం సాధించిందో, మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్ సైతం ఆ స్థాయి విజయాన్నే సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది.
అభిమానుల సంబరాలు లేకున్నప్పటికీ... బ్లాక్ లైవ్స్ మ్యాటర్ స్ఫూర్తిని అందిస్తూ, చెరో విజయంతో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లో సిరీస్‌లో సమవుజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో టెస్టులో విజేత ఎవరైనప్పటికీ.... అది మాత్రం ప్రపంచ క్రికెట్‌కు కరోనా మహమ్మారి వేళ గొప్ప ఆరంభం అని చెప్పవచ్చు.
తాజా విజయంతో ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. వెస్టిండీస్ సిరీస్ అవకాశాలు ఏమాత్రం తక్కువ కాదు. దీంతో నిర్ణయాత్మక మూడో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి రెండు టెస్టుల మాదిరిగానే మూడో టెస్టు సైతం ఉత్కంఠభరిత ముగింపు ఫలితం ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయి. మాంచెస్టర్‌లోనే నేడు ఇంగ్లాండ్, వెస్టిండీస్ మూడో టెస్టు ఆరంభం.
ఆర్చర్ వచ్చేసాడు....
బయో బబుల్ ప్రోటోకాల్ అతిక్రమించిన జోఫ్రా ఆర్చర్ అనంతరం జాతి వివక్ష దూషణతో మానసికంగా కుంగిపోయాడు. మెంటల్ ఫిట్‌నెస్ లేదని స్వయంగా వెల్లడించాడు. ఆర్చర్‌కు ఇంగ్లాండ్ జట్టు మద్దతుగా నిలువనుంది.
నిర్ణయాత్మక మూడో టెస్టుకు బలమైన ఇంగ్లాండ్‌నే బరిలో నిలుపుతామని కోచ్ సిల్వర్‌వుడ్ వెల్లడించాడు. బ్యాటింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. రోరీ బర్న్స్, డామినిక్ సిబ్లే, క్రావ్లీ సహా జో రూట్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్‌లు బ్యాటింగ్ లైనప్‌లో ఉండనున్నారు.
బౌలింగ్ విభాగంలో మార్పులు ఉండనున్నాయి. రెండో టెస్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్, జేమ్స్ అండర్సన్‌లు తిరిగి జట్టులోకి రానున్నారు. స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి ఈ ఇద్దరు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
స్పిన్నర్‌గా డామ్ బెస్ చోటు నిలుపుకోనున్నాడు. జో రూట్ భారీ స్కోరుపై కన్నేయగా.. బెన్ స్టోక్స్ మరోసారి ఎక్స్ ఫ్యాక్టర్ కానున్నాడు. స్టువర్ట్ బ్రాడ్‌కు మాంచెస్టర్‌లో కండ్లుచెదిరే రికార్డు ఉంది. అతడికి ఆర్చర్, అండర్సన్ తోడైతే ఇంగ్లాండ్ పేస్ దాడిని ఎదుర్కొవటం అంత సులువు కాదు. వీరికి తోడు బెన్ స్టోక్స్ ఉండనే ఉన్నాడు. టాప్ ఆర్డర్‌లో బర్న్స్, క్రావ్లీ జట్టులో స్థానానికి న్యాయం చేయాల్సి ఉంది.
వర్షంతో ఓ రోజు ఆట తుడిచిపెట్టుకుపోయినా ఇంగ్లాండ్ విజయాన్ని ఆపలేకపోయింది విండీస్. మరోసారి నాల్గో ఇన్నింగ్స్‌లో జెర్మైన్ బ్లాక్‌వుడ్ హీరోయిక్స్ ఆశలు రేపినా ఫలితం లేకపోయింది. విజ్డెన్ సిరీస్ నిలుపుకోవాలనే సంకల్పంతో ఇంగ్లాండ్‌లో కాలుమోపిన కరీబియన్లు ఇప్పుడు సిరీస్‌ను పోగొట్టుకుని స్వదేశానికి వెళ్తారని అనుకోవటం పొరపాటే.
దీంతో మూడో టెస్టులో విండీస్ రెట్టించిన ఉత్సాహంతో ఆడనుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ ఐదు వికెట్లు కూల్చాడు. దీంతో స్పిన్నర్ రహీమ్ కార్న్‌వాల్‌ను తుది జట్టులోకి తీసుకునేందుకు అవకాశం ఎక్కువ. బ్యాటింగ్ ఆర్డర్‌లో కాంప్‌బెల్, బ్రాత్‌వేట్, హౌప్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శనలు బాకీ పడ్డారు. సమష్టిగా మెరిస్తే ఇంగ్లాండ్‌పై మరో విజయం కరీబియన్లకు పెద్ద విషయం కాదు.
వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌లో అందరూ ఏదో ఒక ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసినవారే. కానీ ఇప్పుడు అందరూ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరం వచ్చింది. పేస్ దళంలో కెప్టెన్ జేసన్ హౌల్డర్ రెండో టెస్టులో నిరాశపరిచాడు. గాబ్రియల్, కీమర్ రోచ్‌తో కలిసి హౌల్డర్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌కు సవాల్ విసరనున్నాడు.