
సోమవారం ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో 1-2తో సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. మూడేండ్లుగా ఆ జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మార్క్ బౌచర్.. తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ వరకు అతడు జట్టుతో కొనసాగనున్నాడు. ఈ మేరకు క్రికెట్ సౌతాఫ్రికా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
2019 నుంచి సౌతాఫ్రికా జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న మార్క్ బౌచర్.. దక్షిణాఫ్రికాకు అపురూప విజయాలు అందించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2023)రేసు లో భాగంగా సఫారీ జట్టును రెండో స్థానంలో నిలిపాడు.
ఇక బౌచర్ నిర్ణయంపై క్రికెట్ సౌతాఫ్రికా కూడా స్పందించింది. ‘మూడేండ్లుగా మాతో ప్రయాణిస్తున్న బౌచర్ కు కృతజ్ఞతలు. బౌచర్ ఈ మూడేండ్ల కాలంలో కఠిన కాలంలో జట్టుకు అండగా నిలబడ్డాడు. గడిచిన కొద్దిరోజలుగా జట్టులో సీనియర్లంతా రిటైర్ అవుతున్నా.. కొత్త వారితో జట్టులో ఉత్సాహాన్ని నింపాడు...’ అని పేర్కొంది.
బౌచర్ హయాంలో సౌతాఫ్రికా.. 11 టెస్టులు, 12 వన్డేలు, 23 టీ20లలో విజయం సాధించింది. ఈ ఏడాది టీమిండియా తో జరిగిన టెస్టు సిరీస్ ను సౌతాఫ్రికా 2-1 తో విజయం సాధించింది. వాస్తవానికి సౌతాఫ్రికా హెడ్ కోచ్ గా 2023 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ బౌచర్ మాత్రం అంతకుముందే దిగిపోనున్నాడు.
అయితే సౌతాఫ్రికా కోచ్ గా దిగిపోనున్న బౌచర్.. ఆ దేశంలో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కాబోయే మినీ ఐపీఎల్ (సౌతాఫ్రికా టీ20 లీగ్) లో ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి.